
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మై వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా మాజీ సీఎం ఎస్.ఆర్.బొమ్మై కుమారుడే బసవరాజ్ బొమ్మై.
ఇక దక్షిణాదిలో తొలిసారిగా బీజేపీని గెలిపించిన నేతగా అరుదైన గుర్తింపు పొందిన బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. యడ్డీ వ్యతిరేక వర్గం ఒత్తిళ్ల నేపథ్యంలో సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా రెండేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న రోజే ఈ మేరకు పదవి నుంచి వైదొలగడం గమనార్హం. ఈ క్రమంలో... సీఎం రేసులో బసవరాజ్ బొమ్మై, అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు రాగా.. బసవరాజ్ బొమ్మైనే అదృష్టం వరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం జరిగే ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment