కర్ణాటక ఎన్నికల్లో ఎదురుదెబ్బతో బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే అప్రమత్తమైంది. కేసీఆర్ సర్కార్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొని ఢీ అంటే ఢీ అనేలా తెలంగాణలో పార్టీని సంసిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం పారీ్టలో అవసరమైన మార్పుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత అనుభవమున్న, బీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాలను పసిగట్టి తిప్పికొట్టగలిగిన సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని.. మరికొందరు నేతలకూ చేతినిండా ‘పని’ అప్పగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే అగ్రనేత,కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఈటలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారని, మరికొందరు నేతలతోనూ మాట్లాడనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో.. దక్షిణాదిలో ఆశలు పెట్టుకున్న మరో రాష్ట్రం తెలంగాణలోనైనా గెలవాలన్న దిశగా బీజేపీ అగ్ర నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాష్ట్ర పారీ్టలో పలు కీలక మార్పులకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పలు కొత్త నియామకాలు చేపట్టడంతోపాటు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే పనిలో పడింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం ఆధారంగా.. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు బీజేపీలోని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి వారం, పది రోజుల్లోనే జాతీయ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నాయి.
అమిత్‌షాతో ఈటల భేటీ.. కీలక బాధ్యతపై సంకేతాలు..
పార్టీ పెద్దల పిలుపు మేరకు సోమవారం ఢిల్లీకి చేరుకున్న ఈటల రాజేందర్.. మంగళవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, చేరికలు, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు వ్యూహ రచన, నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై చర్చించినట్టు తెలిసింది. వాస్తవానికి తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా, ఇతర అంశాల్లో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో రాష్ట్ర పార్టీని సంసిద్ధం చేయాలని.. ప్రస్తుతమున్న స్పీడ్, అనుసరిస్తున్న పద్ధతులు ఇందుకు సరిపోవని కొంతకాలంగా పలువురు సీనియర్లు అధిష్టానం వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయడం, పార్టీ అజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం.. కొందరిని బాధ్యతల నుంచి తప్పించడంతోపాటు మరికొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న అంశంపైనే అమిత్‌షాతో ఈటల భేటీలో ఎక్కువగా చర్చలు సాగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్ వరకు కీలక నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను అమిత్‌షా ఇచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. వీటిలో ఏదో ఒక బాధ్యతను ఈటలకు అప్పగిస్తామని అమిత్‌షా హామీ ఇచి్చనట్టు తెలుస్తోంది.
మరికొందరు ముఖ్యనేతలతో సంప్రదింపులు?
రాష్ట్ర పారీ్టలో చేపట్టబోయే కీలక మార్పులు, ముఖ్యమైన బాధ్యతలను అప్పగింతకు సంబంధించి మరికొందరు ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బీజేపీ ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఆయా నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నాక.. వారం, పది రోజుల్లోనే నియామకాలపై అధికారిక ప్రకటన ఉండొచ్చనే అభిప్రాయం పారీ్టలో వ్యక్తమవుతోంది. ఇతర పారీ్టల నుంచి ముఖ్య నేతల చేరికలకు సంబంధించి సైతం ఈ భేటీలో కొంత స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.
ఈటల హైదరాబాద్‌కు వచ్చాక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతోపాటు బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో భేటీ అయి చేరికల ప్రక్రియను వేగవంతం చేయాలని అమిత్‌షా సూచించినట్టు సమాచారం. తాను ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదట్లో తెలంగాణ పర్యటనకు వస్తానని చెప్పినట్టు తెలిసింది. ఆ పర్యటన సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, పార్టీ మేనిఫెస్టో, పార్టీ బలోపేతం, రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గాల వరకు ముఖ్య నేతల బహిరంగ సభలు, ఇతర అంశాలపై అమిత్‌షా దిశానిర్దేశం చేస్తారని పారీ్టవర్గాలు చెప్తున్నాయి.
నేడు ఢిల్లీకి సంజయ్?
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా జాతీయ నేతల నుంచి పిలుపు వచ్చిందని, ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఆరోగ్యపరమైన అంశంపై ఢిల్లీ వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నానని.. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని సంజయ్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది.
అసంతృప్తిని చక్కదిద్దేందుకే?
బీజేపీలో చేరినప్పటి నుంచీ తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని జాతీయ నాయకత్వం వద్ద ఈటల రాజేందర్ పలుమార్లు అసంతృప్తి వెలిబుచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సత్సంబంధాలు కొరవడటం, పాత–కొత్త నేతల మధ్య సమన్వయ లేమి, బీఆర్‌ఎస్ వైఫల్యాలపై ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లలేకపోవడం, ఇతర పారీ్టల నుంచి చేరికలు ఆగిపోవడం, ముఖ్య నేతలు వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకే ప్రాధాన్యత నివ్వడం వంటి అంశాలను జాతీయ నాయకత్వం గుర్తించినట్టు సమాచారం. దీనికితోడు తాజాగా కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడంతో.. అసంతృప్తులను చక్కదిద్దడం, సమన్వయాన్ని నెలకొల్పడం కీలకమని నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. తద్వారా పార్టీ కేడర్‌లో విశ్వాసాన్ని నింపవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని మార్పుచేర్పులకు సిద్ధమైనట్టు తెలిసింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఈటల.. బండి సంజయ్‌కు అధిష్టానం నుంచి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment