
వికారాబాద్ రోడ్‌షోలో భాగంగా ఎండ్లబండి తోలుతున్న బండి సంజయ్. చిత్రంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ నేత ఎ.చంద్రశేఖర్
వికారాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ పోరాటం మొదలైందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం వికారాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ కేసీఆర్ తన కుటుంబం కోసం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. సంజయ్ చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో మార్పునకు నాంది పలుకుతుందఅన్నారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చుని ప్రజలను ఎలా దోచుకోవాలని పథకాలు రచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు. రైతు, ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలంటే సంజయ్‌ను ఆశీర్వదించాలని కోరారు.
రాక్షసుడు రాజ్యమేలుతుండు..
అమరవీరుల త్యాగాలతో గద్దెనెక్కి.. తెలంగాణ లో ఓ రాక్షసుడు రాజ్యమేలుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వికారాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గ్రానైట్ మాఫియాతో కుమ్మౖక్కైన సీఎం, తాండూరు బండలను మరుగున పడేశారన్నారు. హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు కేంద్రం రోడ్డు మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి స్థలసేకరణ చేతగాక రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వికారాబాద్ జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1,240 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. కేంద్రం ఇళ్లు ఇస్తామంటే కేసీఆర్‌కు లబ్ధిదారుల జాబితా ఇవ్వటం చేతగావటంలేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారికి గులాంగిరీ చేయడం ఎంఐఎంకు అలవాటుగా మారిందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే బీజేపీకి పేరు వస్తుందనే కుట్రతోనే కేసీఆర్ టీకా కూడా వేసుకోవటంలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చంద్రశేఖర్, జనార్దన్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, కాసాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.