కేటీఆర్‌ను నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మూడు జిల్లాల్లో కోటి మంది మూసీ కాలుష్యంతో బాధపడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. మూసీని ఎందుకు శుద్ధి చేయలేదో ప్రజలకు తెలియజేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన సచివాలయంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలసి మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాల ప్రజల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మూసీ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారని, మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. కేటీఆర్, హరీశ్‌రావు.. ఇద్దరి నోటికి అదుపు లేకుండా ఉందని, అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని అన్నారు.
ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నట్లు ఊహించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల ప్రజలు దాదాపు కోటి మందిపైన కాలుష్య ప్రభావం పడుతోందని అన్నారు. మూసీ నది, ఎస్‌టీపీలు ఏర్పాటు చేస్తే బాగుపడేది కాదన్నారు. ఇందులో విషపూరిత లవణాలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మూసీ ప్రాజెక్టు పేరిట రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ పిచ్చి కూతలు కూస్తే జనాలు తంతారని, చాదర్‌ఘాట్, మలక్‌పేట్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏముందో తనకు అర్థం కాలేవడం లేదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, మూసీ ప్రాజెక్టుకు అడ్డు పడితే జిల్లా ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ మోసాలకు ఇప్పటికే నల్లగొండ నరకయాతన పడుతోందని, ఇప్పుడు ఆయన కొడుకు కూడా తయారయ్యారని ఆగ్రహించారు. కాగా, కేటీఆర్, హరీశ్‌రావు అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment