ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరచు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని సైకో పాలన అని, జగన్ సైకో అని దారుణమైన విమర్శలు చేస్తుంటారు. రాష్ట్రం నాశనం అయ్యిందని ప్రచారం చేస్తారు. వారికి డబ్బా కొట్టే ఎల్లో మీడియా ఉంది కనుక అదే పనిగా వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఎవరిని సైకో అనాలి?అసలు అలాంటి పదాలు వాడడమే తప్పు కదా!. అందులోను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా దిగజారుడుగా మాట్లాడడం అంటే తనను తాను కించపరచుకోవడమే.
ఆయన(నారా చంద్రబాబు నాయుడు) పాలనను, జగన్ పాలనను విశ్లేషిస్తే ఎవరిది సైకో పాలనో అర్దం అవుతుంది. చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు , 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 కి ముందు పలు ఎన్ కౌంటర్లు జరిగాయి. బెంగుళూరులో పట్టుబడిన కొందరు నక్సల్ ప్రముఖులను జగిత్యాల ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేశారన్న ఆరోపణ కూడా వచ్చింది. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిగాయి. ఈ మధ్య గద్దర్ సంతాప సభలో సోమన్న అనే గాయకుడు పాట పాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నయీం, నాగరాజు, సమ్మిరెడ్డి వంటి మాఫియాలను తయారు చేసింది చంద్రబాబేనని అతను ఆ పాటలో విమర్శించాడు. ఆ వీడియో వైరల్ అయింది.ఇలా పాలన చేసినవారిని కదా సైకో అనాల్సింది. విశేషం ఏమిటంటే ఆ తర్వాత గద్దర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒకటే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అలాగైతే ఆయన హయాంలో అన్ని ఫేక్ ఎన్ కౌంటర్లు ఎందుకు జరిగాయన్నదానికి జవాబు దొరకదు.
✍️ అంతేకాదు.. 2014 తర్వాత చంద్రబాబు పాలనలో తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ ల పేరుతో తమిళ కూలీలు ఇరవై మందిని ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఉంది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఇవి నకిలీ ఎన్ కౌంటర్లని ప్రకటించి, సంబంధిత కూలీల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది. ఇంతమందిని ఒకేసారి ఎన్ కౌంటర్ చేసినా ఒక్క పోలీసు అదికారిపై చర్య తీసుకోలేదు. వీటినే రాజ్య హింస అని గతంలో అనేవారు. ముఖ్యమంత్రిగా జగన్ బాద్యతలు చేపట్టిన తర్వాత ఒక్కటైనా ఎన్ కౌంటర్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయా?. మరి అలాంటప్పుడు ఆయన ఎలా సైకో అవుతారు?. అంటే చంద్రబాబు తన లక్షణాన్ని ఎదుటి వారికి ఆపాదిస్తారన్నమాట.
✍️ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎన్ని కార్యక్రమాలకు హాజరైనా ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు. ప్రజలు ఎక్కడ ఆపినా ఆగి వారి బాధలు విని సాధ్యమైన పరిష్కారాలు చూపుతుంటారు. అయినా ఆయనది సైకో పాలన అని చంద్రబాబు ఆరోపిస్తారు. మరి ఆయన సీఎంగా ఉండి గోదావరి పుష్కరాలకు వెళ్లి, సామాన్య భక్తుల ఘాట్ లో కుటుంబంతో స్నానమాచరించి, సినిమా తీయడం కోసం సామాన్యులను నిలువరించిన వైనం కదా సైకో పాలన అని అనిపించేది. అప్పట్లో ఈ పబ్లిసిటీ పిచ్చి వల్ల 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారు? కుంభమేళాలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో మృతి చెందడం లేదా? అని ఏ మాత్రం దయ లేకుండా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని కదా సైకో భావజాలం అని అనాల్సింది.
✍️ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి ఎందుకు దేవాలయం వంటి ప్రదేశానికి వచ్చారని గదమాయించిన చంద్రబాబును ఏమంటారు! ప్రభుత్వం నడిపినప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉండి కూడా తన సభకు జనం బాగా వచ్చారని చెప్పుకోవడం కోసం ఇరుకు రోడ్లపై సభలు పెడుతున్నారు. అదే క్రమంలో కందుకూరులో ఎనిమిది మంది మరణిస్తే, అది పోలీసుల బాద్యత అని ఎదురు దబాయించారు. దానిని కదా సైకో తత్వం అనవలసింది. తన సభకు కానుకలు ఇస్తామని చెప్పడం, జనం ఎగబడి తొక్కిసలాటలో ముగ్గురు మరణించడాన్ని కదా సైకో శైలి అని అనవలసింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా అవమానించింది చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా! ఆయనను బలవంతంగా రాజమండ్రి ఆస్పత్రికి తరలించి ఎవరిని కలవకుండా చేయలేదా?ఆయన కుటుంబాన్ని నానా బూతులు తిట్టింది ఆయన పాలనలోని పోలీసులే కదా! దానిని కదా సైకో వ్యవహార శైలి అనవలసింది.
✍️ తుని వద్ద రైలు దగ్దం అయితే దానిని ఆర్పే పని మానేసి రాయలసీమ నుంచి, కడప నుంచి గూండాలు వచ్చారని మీడియా ముందుకు వచ్చి ఆరోపించడాన్ని ఏమంటారు. పద్దతైన పాలన అని అంటారా?. ఆ తర్వాత ఆ ప్రాంతం వారిని కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపువర్గం వారినే అరెస్టు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారని వారు ఆరోపించేవారు. దానిని ఏ తరహా పాలన అని అంటారు. కానీ, జగన్ ప్రభుత్వం వారిపై కేసులు ఎత్తివేస్తే అది సైకో పాలన అవుతుందా? సానుభూతితో వ్యవహరించినట్లా? అమరావతి రాజధాని పేరుతో వందలాది మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకోవడం, ఇవ్వడానికి ఇష్టపడనివారిని, కోర్టులకు వెళ్లినవారిని ఎన్ని విదాలుగా కష్టాలు పెట్టింది తెలియదా?. దానిని కదా సైకో పాలన అని అనవలసింది. జగన్ పాలనలో ఆయనకు వ్యతిరేకంగా నిత్యం ఒక వంద మంది కూర్చుని ఆందోళన చేస్తున్నా ఎన్నడైనా వారిని అడ్డుకున్నారా?. రాజధానికి పొలాలు ఇవ్వనివారి పైర్లు తగులబెట్టించడమే కాకుండా, వైఎస్సార్‌సీపీ ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్‌ను ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి నానా విధాలుగా హింసలు పెట్టించింది ఎవరు?. అప్పుడు ఆయన దళితుడుగా కనిపించలేదా?జగన్ పాలనలో అలా కావాలని ఎవరైనా చేశారా?ఒకవేళ ఎక్కడైనా పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నది జగన్ ప్రభుత్వం కాదా?
✍️ ఒక డాక్టర్ తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే అడ్డుపడి చేతులు వెనక్కి కట్టేస్తేనే ఇంకేముంది ‘దళిత డాక్టర్ ను హింసించారు ..’అంటూ చంద్రబాబు బృందం గోల చేస్తే, అప్పట్లో న్యాయస్థానం వారు దానిపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత రోజుల్లో అది ఏమైందో తెలియదు. కానీ, చంద్రబాబు టైమ్ లో జరిగిన ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణకు, సిబిఐ విచారణకు ఎందరు డిమాండ్ చేసినా, కోర్టుకు వెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడం కూడా ఆసక్తికరమైన అంశమే.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో హామీలు ఇచ్చి అమలుచేయనివారిని నడిరోడ్డుపై కాల్చాలని అన్నందుకు ఎంత పెద్ద గొడవ చేశారు. ఇంకేముంది .. ముఖ్యమంత్రిని పట్టుకుని అంత మాట అంటారా?అంటూ విపరీత ప్రచారం చేశారు. అలాంటి మాటలు చంద్రబాబు అంటే మాత్రం వాటిని కప్పిపెట్టేస్తారు. జగన్ తదుపరి కాలంలో ఎన్నడూ అలాంటి మాటలుమాట్లాడలేదు.
కానీ.. ఇటీవలికాలంలోచంద్రబాబు ఇష్టం వచ్చినట్లు కార్యకర్తలను రెచ్చగొట్టి ‘‘తరమండిరా? నా... ’’అంటూ బూతులు మాట్లాడడం, అంతుచూస్తా.. అంటూ బెదిరించడమే కాకుండా, టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసు వాహనాలను దగ్దం చేస్తే, పోలీసులపై దాడి చేస్తే, ఒక కానిస్టేబుల్ కన్ను పోతే కనీసం సానుభూతి చెప్పని చంద్రబాబును ఏమనాలి? అలాంటివారిని కాదా సైకో అని అనవలసింది. జగన్ ఎప్పుడైనా అలా దురుసుగా వ్యవహరించారా?రెచ్చగొట్టారా?రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే గొడవలు సృష్టించాలనుకోవడం సైకోల పని అవుతుంది కాని, శాంతి భద్రతలు కాపాడే జగన్ ప్రభుత్వం సైకో పాలన ఎలా అవుతుంది.కేవలం ఏవో కొన్ని పిచ్చి డైలాగులు చెబుతూ ప్రజలను మభ్య పెడుతూ రాజకీయం చేయడం అన్నిటిని మించిన సైకోల పని అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా?.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment