ఏపీమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్దతను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు..అవును!వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కాని అది నిజమే!అఫ్ కోర్స్ ..వెంటనే బహుశా తేరుకుని తన ఒరిజినల్ స్టైల్ లో జగన్ ను విమర్శించడం, అబద్దాలు చెప్పడం జరిగిపోయిందనుకోండి..విశాఖలో రిషికొండ పై జగన్ టైమ్ లో నిర్మించిన అత్యంత ఆధునిక భవనాలను చంద్రబాబు పరిశీలించారు. వాటిని చూసినప్పుడు మనసులో ఒక భావన కలిగి ఉండాలి.
అలాంటి భవనం ఒక్కదానినైనా తాను అమరావతిలో నిర్మించలేకపోయానే అని!ఆ ఝలసీతోనే తదుపరి మాట్లాడారనిపిస్తుంది. తానేమో సుమారు రెండవేల కోట్లకుపైగా వ్యయం చేసి అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, కోర్టు భవనాలు నిర్మిస్తే, అవి చాలీ,చాలనివి కావడం, వర్షం వస్తే నీరు కారడం, వరద వస్తే ఏమవుతుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడింది. అదే జగన్ విశాఖలో కార్యనిర్వాహక రాజధాని చేసే ఉద్దేశంతో రిషికొండపై ఆకర్షణీయమైన భవనాలు నిర్మిస్తే వాటిని చంద్రబాబు సైతం ప్రశంసించకుండా ఉండలేని పరిస్థితి. మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెల్ఫీలు దిగి ముచ్చటపడిన తీరు .
పైకి వారు జగన్‌ను దూషించినా, లోపల మాత్రం ..భలేగా ఉన్నాయి భవనాలు అని అనుకునే ఉండాలి.రిషికొండ విశాఖకు ప్రతిష్టాత్మకంగా ఉండే ప్రదేశం. అక్కడ కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలన్న తలంపుతో సముద్రతీరంలో ఉన్న ఆ కొండపై అప్పటికేఉన్న టూరిజం భవనాలు కొన్నిటిని తొలగించి ,కొత్త భవనాలు నిర్మించి విశాఖకే మకుటాయమానంగా జగన్ తీర్చిదిద్దారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి,కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే, అక్కడ బస చేస్తే రాష్ట్ర ప్రతిష్ట పెరిగేలా వాటిని రూపొందించారు.వాటి నిర్మాణం సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎన్ని రకాలుగా ఆటంకాలు క్రియేట్ చేయాలో అన్నీ చేశాయి. వాటిని తట్టుకుని జగన్ ప్రభుత్వం ఆ భవనాలను పూర్తి చేసింది.కాని అనూహ్యంగా ఈవిఎమ్ ల మహిమో,మరే కారణమో తెలియదు కాని ఆయన ప్రభుత్వం ఓడిపోయి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రిషికొండకు వెళ్లాలా?వద్దా ?అని ఇన్ని నెలలు తటపటాయించి ఎలాగైతేనేం వాటిని చూడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉండలేకపోయారు.
ఆ సందర్భంగా ఆయన మాటలు చూడండి..భవనాలు అద్భుతంగా ఉన్నాయని, కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించారని, నాలుగు బ్లాక్ లు కూడా అలాగే లేటెస్ట్ సాంకేతికతతో కట్టారని ఆయన చెప్పారు. వీటిని చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిందని అన్నారు. ఎన్నో దేశాలలో పాలెస్ లు చూశాను కాని ఇలాంటి కట్టడాలు చూడలేదని అన్నారు. రాష్ట్రపతి భవన్ కన్నా అధ్బుతంగా నిర్మించారని, అమెరికాలో వైట్ హౌస్ కూడా ఇలా ఉండదని అన్నారు. అయితే ఇదంతా ఆయన జగన్ సమర్ధతను పొగుడుతున్నానని తెలియకుండానే మాట్లాడి, ఆ వెంటనే ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని ముక్తాయించారు. భవనంలో ఆ రూమ్ ఇలా ఉంది..అలా ఉంది..టాయలెట్ అంత ఖరీదైనదా?జగన్ పాలెస్ కట్టుకున్నారు..ఆయన ఏమైనా రాజా?చక్రవర్తా?ప్రజలకు కూడా చూసే అవకాశం కల్పించి ఆ భవనాలను ఏమి చేయాలో ఆలోచిస్తానని ప్రకటించారు.
ఈ బిల్డంగ్ కట్టినందుకు జగన్ రాజకీయాలకు పనికి వస్తారో, రారో జనం నిర్ణయించుకోవాలట.ఇంత గొప్పగా ఒక నిర్మాణం చేయగలిగిన జగన్‌ది గొప్పతనం అవుతుందా?కాదా?ఇతర దేశాలలో కూడా లేని విధంగా విశాఖలో ఒక భవన సముదాయం వచ్చినందుకు సంతోషించాలి కాని, అసూయతో కుళ్లితే ఏమి లాభం? ఒకవైపు విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తూ, వేలాది మంది ఉద్యోగాలు పోతున్నాయని వారంతా ఆందోళనకు దిగుతుంటే పట్టని చంద్రబాబు నాయుడు,డైవర్షన్ రాజకీయంలో భాగంగా మళ్లీ విశాఖ రిషికొండ భవనాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారంచేస్తున్నారు.
వాటి వల్ల పర్యావరణం దెబ్బతిందని మరో ఆరోపణ చేశారు.అది నిజమే అయితే, గతంలో టిడిపి హయాంలోనే రిసార్ట్స్ కట్టారు కదా అన్నదానికి ఆయన జవాబు ఇవ్వరు. ఒక వైపు అది జగన్ సొంత పాలెస్ అని ప్రచారం చేస్తారు..ఇంకో వైపు టూరిజం శాఖ సీఎం అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వ భవనాల సందర్శన అని చెబుతుంది. దీనిని బట్టే చంద్రబాబు ఎంత పచ్చిగా అబద్దాలు చెప్పగలరో కనిపించడం లేదా!ఆ కొండపై అంతా కలిపి అరవై ఎకరాల భూమి లేదు.అక్కడ మళ్లీ పచ్చదనం అప్పుడే మొదలైంది. పైగా రాష్ట్రానికే అదంతా ప్రతిష్టాత్మకంగా మారింది.అది ప్రొజెక్టు చేస్తే జగన్‌కు మంచి పేరు వస్తుందన్న దుగ్దతో ఉన్నవీ,లేనివి కల్పించి,డబ్బు వృధా అయిందంటూ అసత్యాలు ప్రచారం చేశారు.
ఒక చిన్న కొండపైన నాలుగు భవనాలు నిర్మిస్తేనే పర్యావరణం దెబ్బతింటే, చంద్రబాబు అమరావతిలో మూడు పంటలు పండే భూములు ముప్పైమూడువేల ఎకరాలు ఎందుకు రాజధాని పేరుతో తీసుకున్నారు? పచ్చటి పొలాలను బీడు భూములుగా ఎందుకు మార్చారు?ఏడేనిమిదేళ్లుగా అక్కడ పర్యావరణం అంతా దెబ్బతినిపోలేదా?అవన్ని ఎందుకు? కృష్ణానది కరకట్టపై సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నారే.దాని వల్ల పర్యావరణానికి నష్టం కలగడం లేదా?కరకట్ట వెంట ఉన్న భవనాల నుంచి వ్యర్ధాలు నదిలో కలుస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నా ఆయన అక్కడ నుంచి ఖాళీ చేయడం లేదే!పైగా కోట్ల రూపాయల వ్యయంతో సిసి టీవీ కెమెరాలు, ఫెన్సింగ్‌లు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటున్నారే. జగన్ 450 కోట్లు ఖర్చు చేసి విశాఖకు ఒక అందాన్ని తీసుకు వచ్చారు.
అది తమ విధానం కాదని, తాము సింపుల్ గా ఉంటామని చంద్రబాబు ఎన్నడైనా చెబుతారా?తాను నిర్మిస్తే అది చాలా గొప్ప విషయం.ఎదుటివారు కడితే ధనం వృధా..ఆయనేమైనా రాజా?చక్రవర్తా?అని వ్యాఖ్యలు. ఏ ప్రజాస్వామ్యంలో చెప్పారు.. లక్ష కోట్ల వ్యయం చేసి రాజధాని కోసం భవనాలు కట్టమని?తెలంగాణలో సచివాలయ కొత్త భవనానికి అంతా కలిపి వెయ్యి కోట్లు కాలేదు.కాని అమరావతిలో కేవలం తాత్కాలిక సచివాలయ, అసెంబ్లీ భవనాలకే సుమారు 1500 కోట్లు చంద్రబాబు ఎలా ఖర్చు చేశారు?అవి పనికి రావని మళ్లీ నాలుగువేల కోట్లో ,ఇంకా ఎక్కువ మొత్తంతోనో సచివాలయ భవనం నిర్మిస్తామని ఎందుకు చెబుతున్నారు.
ఏకంగా ఏభై అంతస్తుల భారీ భవంతిని, పైన హెలికాఫ్టర్ దిగేలా ప్లాన్ చేస్తున్నారే. అదంతా డబ్బు వేస్ట్ చేయడం కాదా?అక్కడ భూమి బహుళ అంతస్థుల భవనాలకు అనుకూలమైనది కాదని నిపుణులు చెబుతున్నా, వేల కోట్లు కేవలం పునాదులకే వ్యయం చేయబోతున్నారే! రకరకాల డిజైన్లు అంటూ ఎన్ని వందల కోట్లు వృధా చేశారు. ఒకసారి ఇడ్లీపాత్ర షేప్ అని, ఇంకోసారి ఇంకేదో అని చెబుతూ గ్రాఫిక్స్ చూపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారే! రిషికొండ భవనాలు జగన్ సొంత నివాసమైతే చంద్రబాబు ఆ భవనాల వద్దకు ఎందుకు వెళ్లారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నిజంగానే చంద్రబాబు అంత పొదుపరి అయితే గత టరమ్ లో హైదరాబాద్ లో ఎన్ని నివాసాలకు ఆయన ప్రభుత్వ ధనం వెచ్చించారు?ఏకంగా స్టార్ హోటల్ పార్క్ హయత్ లో ఒక ప్లోర్ తీసుకుని ఎన్ని కోట్ల వ్యయం చేశారు?అంతెందుకు వరదలలో తన కరకట్ట ఇల్లు మునిగిపోతే , కలెక్టరేట్ ఆవరణలో ఐదు కోట్ల రూపాయల విలువైన బస్ లో ఎందుకు ఉన్నారు. ప్రభుత్వానికి విజయవాడలో పలు అతిధి గృహాలు ఉన్నాయి కదా!అక్కడ ఎందుకు దిగడం లేదు? అంతేకాదు.విజయవాడ వరద బాధితులకు సాయం అంటూ కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కొనుగోలు చేశామంటూ ఇరవైమూడు కోట్లు ఖర్చు రాసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డులలో నిలిచిపోతుంది. విశాఖలో సర్క్యూట్ అతిధి గృహం విఐపిలకు కేంద్రంగా ఉండేది.గతంలో ముఖ్యమంత్రులు వస్తే అక్కడే బస చేసేవారు. మరి చంద్రబాబు అక్కడకు వెళుతున్నారా?ఒకప్పుడు ముఖ్యమంత్రులు రైళ్లలో ప్రయాణించేవారు.
మరి చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నడైనా రైలు ఎక్కారా?ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ లలో ఎందుకు తిరుగుతున్నారు.ప్రజాస్వామ్యంలో రారాజు మాదిరి చిన్న పనికి, పెద్ద పనికి ఇలా ప్రత్యేక విమానాలలో వెళ్లడం డబ్బు దుర్వినియోగం కాదా? చివరికి చంద్రబాబు ఇచ్చాపురం వద్ద ఒక పల్లెలో ఒక గ్యాస్ బండ ఇచ్చి, ఒక ఇంటిలో టీ కాయడానికి వెళ్లడానికి గాను ప్రత్యేక విమానం, హెలికాఫ్టర్ ను వాడాలా?ఎక్కడైనా రోడ్డుపైన ఉండే గోతిని పూడ్చడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నడైనా వెళ్లడం చూశామా?అది ఆర్.అండ్ బి శాఖలో చిన్న స్థాయి ఉద్యోగులు చేసే పని.దానికి ఎందుకు లక్షలు వ్యయంతో ఆర్భాటం చేశారో చెప్పగలరా? అంతా ప్రచార యావ తప్ప ఇంకొకటి ఉందా?తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేక, ప్రజలలో ఎదురవుతున్న వ్యతిరేకతను, నిరసనను తప్పించుకోవడానికి ప్రజలను తప్పుదారి పట్టించి, మాయ చేయడానికి ప్రయత్నించడంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు.
రిషికొండపై భవనాలు బాగానే ఉన్నాయట. వాటిని నిర్మించిన జగన్ ప్రభుత్వం మాత్రం తప్పు చేసిందట. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు.ఆ భవనాలలో బస చేయాలని చంద్రబాబుకు కోరిక ఉన్నా, కేవలం జగన్ పై ద్వేషంతో ఆ పని చేయలేకపోతున్నారు. చంద్రబాబుకు ఒక సలహా! ప్రభుత్వపరంగా వాటిని వాడుకోవడం ఇష్టం లేకపోతే,అక్కడ తాను కాని, ప్రధాని,రాష్ట్రపతి,విదేశీ ప్రముఖులు వంటివారు విడిది చేస్తే జగన్ కు పేరు వస్తుందన్న భయం ఉంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. దానిని టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ది చేయండి.నిత్యం వేలాది మందితో కళకళలాడుతుంది. లేదా అక్కడ చక్కని మ్యూజియం ,లేదా ప్రజలకు ఉపయోగమైన గ్రంధాలయం గా మార్చి అందులో కంప్యూటర్లతో సహా అన్ని సదుపాయాలు సమకూర్చి మంచి విద్యా కేంద్రంగా తయారు చేయండి. అంతేకాని జగన్ పై ద్వేషంతో,అక్కసుతో ఆ భవనాలను పాడు చేయకండి.చంద్రబాబు ప్రభుత్వానికి అలాంటి విజ్ఞత వస్తుందని ఆశించవచ్చా!
::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment