మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సవాల్ చేస్తున్నదేమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నది ఏమిటి? ప్రజలను అసలు విషయాల నుంచి తప్పుదారి పట్టించడంలో చంద్రబాబు ఘనాపాటియే అని అంగీకరించాలి. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అలాంటి వారిని అరెస్టు చేస్తే,తొలుత తనను అరెస్టు చేయండని జగన్ సవాల్ చేశారు.
బాబు మోసాలపై తాను ట్వీట్ చేస్తున్నానని, తన పార్టీ నేతలు, క్యాడర్ కూడా ట్వీట్ చేస్తారని, ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టండని, ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం అని జగన్ అన్నారు. బడ్జెట్‌లో చంద్రబాబు మోసాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియచేస్తామని, సోషల్ మీడియాలో ఎండగడతామని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు ఏమని జవాబు ఇవ్వాలి? తానుమోసం చేయలేదని చెప్పగలగాలి. జగన్ చేస్తున్న వాదన సరికాదని నిరూపించగలగాలి. అలా కాకుండా ఆయన ఏమంటున్నారో గమనించండి..
ఎల్లో మీడియాలో వచ్చిన కధనం ప్రకారం శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ' కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా!పశువులా!తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనమో లెక్క?అని అన్నారట.ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రజలను తప్పుదారిటీడీపీ పట్టించే యత్నమా?కాదా?ఎవరు ఎవరి తల్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు?ఎంత అన్యాయంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు!పోనీ ఫలానా వ్యక్తి అని చెప్పకుండా, ఏదో పత్రికలలో ఎవరిమీదనో అన్యాపదేశంగా వార్తలు రాసినట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయవచ్చా?అన్నది ఆలోచించుకోవాలి.
చంద్రబాబు మరో వ్యాఖ్య చూడండి.. కూటమిలోని నేతలు , కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరని, ఒకవేళ పెడితే శిక్షిస్తామని ఆయన అన్నారు. ఇందులో లేశమంతమైనా వాస్తవం ఉందా? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా టీడీపీ ప్రత్యేకించి ఐటీడీపీ పేరుతోనో,మరో పేరుతోనో కొంతమంది కార్యకర్తను సోషల్ మీడియా కోసం వినియోగించింది..అందులో ఎందరు దారుణమైన వికృత పోస్టింగ్ లు పెట్టింది తెలియదా?వారికి స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లే మద్దతు ఇచ్చింది అవాస్తవమా?సీఎంగా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా జగన్ ను ,ఆయన కుటుంబ సభ్యులను దూషించి, అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినవారిపై ఒక్కరి మీద అయినా కేసులు పెట్టారా?కనీసం ఖండించారా?పైగా ఇప్పుడు తమవాళ్లు ఎవరూ పెట్టరని సూక్తులు చెబుతున్నారు.అంతెందుకు జగన్ అధికార టీడీపీ వెబ్ సైట్ లో తన తల్లిపైన పెట్టిన ఒక అబద్దపు పోస్టు గురించి ప్రస్తావించి చంద్రబాబు, లోకేష్‌లను అరెస్టు చేస్తారా?అని డీజీపీని ప్రశ్నించారు.
అందులో రెండేళ్ల క్రిం విజయమ్మ ప్రయాణిస్తున్న ఒక వాహనం టైర్ పంక్చర్ అయితే ఆమె రోడ్డుపక్క నిలబడి ఉన్న ఫోటోని తీసి, ఈ మధ్యే జరిగినట్లు, జగన్ ఆమెను చంపడానికి ఇలాంటి కుట్ర చేశారని టీడీపీ వెబ్ సైట్ లో పెటిన విషయాన్ని ఆధారాలతో సహా తెలిపితే, చంద్రబాబు అది నిజమా?కాదా? అన్నది ఎందుకు చెప్పలేదు?అంతే!అదే చంద్రబాబు స్టైల్. తను చేసే తప్పులను కూడా ఎదుటివారిపై పెట్టడంలో ఆయన నేర్పరి అని అంటారు.మరో వైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా శాసనమండలిలో మాట్లాడుతూ తన అమ్మను అవమానించారు..వారిని సహించాలా అని ప్రశ్నించారు. ఎవరూ సహించాలని చెప్పరు.
అసెంబ్లీలో ఎవరూ అలా మాట్లాడకపోయినా,నెపం నెట్టి ప్రచారం చేశారన్నది వైఎస్సార్‌సీపీవారి వాదన. ఆ వంకతో రాజకీయాల కోసం పదే,పదే అదే విషయాన్ని ప్రస్తావించడం అమ్మకు గౌరవమా?అన్నది ఆలోచించాలి.అదే టైమ్ లో జగన్ భార్య భారతి మీద, వారి కుటుంబ సభ్యులపైన పెట్టిన దారుణమైన అనుచిత పోస్టింగ్‌ల మాటేమిటి?మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కొడాలి నాని తదితరుల కుటుంబ సభ్యులపై ఎంత అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారో సాక్ష్యాలతో సహా చెప్పినా, అసలుఏమీ జరగనట్లు చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరిస్తున్నారే! వీటిపై చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎక్కడా నోరు విప్పరు.
జగన్ ఏపీ బడ్జెట్ పై వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేశారు..15వేల మంది బెవరేజెస్ ఉద్యోగులను తీసేశారు..నిరుద్యోగులకు మూడువేల భృతి ఎగవేస్తున్నారు.తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేను వేల చొప్పున ఇవ్వడానికి 13 వేల కోట్లు అవసరమైతే,ఎంత మొత్తం పెట్టారని ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు..అలా చేయలేదు..ఇవన్ని మోసాలా?కాదా?అని జగన్ అడిగారు.వీటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబుకాని, ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కాని నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు.
చంద్రబాబు మాత్రం యధాప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, విధ్వంసం చేసిందని ఆరోపించారు. రాత్రికి రాత్రే అధ్బుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని చేతులెత్తేశారు.ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అన్నీ అద్బుతాలే చేస్తామని,సంపద సృష్టిస్తామని చెప్పడం అబద్దాలాడినట్లే కదా?అప్పుడు చెప్పినవాటి గురించి , హామీల గురించి ప్రశ్నిస్తే వారిమీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం తప్పుకాదా?
జగన్ బడ్జెట్ పుస్తకాలలో ఉన్న అప్పుల లెక్కల గురించి ప్రస్తావించి, తన హయాంలో అప్పులు 14 లక్షల కోట్లకు వెళ్లాయని అబద్దాలు చెప్పినట్లు కూటమి బడ్జెట్ లోనే తేలింది కదా అని అన్నారు. మొత్తం అప్పు ఏడు లక్షల కోట్ల లోపే ఉన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం అంగీకరించింది కదా అని అన్నారు. అందులోను విభజన నాటికి ఉన్న అప్పు, తదుపరి చంద్రబాు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు పోను అంతా కలిపి తమ హయాంలో మూడు లక్షల కోట్ల అప్పే కదా అని అడిగారు.అందులో కూడా రెండేళ్లు కరోనా సమస్య ఉందన్న సంగతి గుర్తు చేశారు.దీనికి చంద్రబాబు ఆన్సర్ ఇవ్వలేదు సరికదా..మళ్లీ పాత విమర్శలనే చేశారు.
తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనేమో ఆరున్నర లక్షల కోట్లు అని చెబుతారు. ఉపన్యాసంలో మాత్రం జగన్ పాలన పూర్తి అయ్యేసరికి 9.74 లక్షల కోట్లు అని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పద్నాలుగు లక్షల కోట్లు అనడంపై ఎక్కడా వివరణ ఇవ్వరు. అదే చంద్రబాబు విలక్షణ సరళి అని చెప్పుకోవాలి. జగన్ టైమ్ లో జిఎస్టి, జిఎస్డిపి,తలసరి ఆదాయం అన్నీ పెరుగుదల చూపినా, వాటినన్నిటిని తోసిపుచ్చుతూ తనకు తోచిన అంకెలతో చంద్రబాబు గారడి చేశారు. జగన్ టైమ్ లో విద్యుత్ చార్జీలు కొద్దిగా పెరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గగ్గోలుగా ప్రచారం చేసేవారు.
ఎల్లో మీడియా పూనకం వచ్చినట్లు ఘీబెట్టేది. అదే చంద్రబాబు టైమ్ లో ఏకంగా యూనిట్ కు రూపాయిన్నర వరకు పెరిగినా, అందుకూ జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెరగవని, పైగా తగ్గిస్తానని చెప్పారుగా అని ఎవరైనా అడిగితే,ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా?అని కేసులు పెట్టే పరస్థితి ఏర్పడింది.వీటిపై జగన్ నిలదీసినా చంద్రబాబు కాని ఆయన మంత్రులు కాని నోరుపారేసుకోవడం తప్ప సమాధానం ఇవ్వడం లేదు.
జగన్ అసెంబ్లీలో తనకు ఎలాగూ అవకాశం ఇవ్వరని, సవివరంగా తన ఆఫీస్ నుంచే బడ్జెట్ పై మాట్లాడి అనేక ప్రశ్నలు సంధించారు .చంద్రబాబువి అన్నీ మోసాలేనని ,సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, జగన్ స్పష్టం చేస్తూ అదే ప్రకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు కూడా అలాగే పోస్టు చేశారు.దానిపై మాత్రం చంద్రబాబు మాట్లాడరు.కాని అసభ్య పోస్టులు అంటూ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారు.చంద్రబాబు ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?ఏమో పరిస్థితి చూస్తే అలాగే ఉంది.జగన్ అడిగేవాటికి జవాబులు చెప్పలేనప్పుడు చంద్రబాబుకు ఇదొక్కటే మార్గమా!
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment