ఇది సీఎం రేవంత్‌ వ్యూహంలో భాగమా? | KSR Comment On CM Revanth Reddy, Allu Arjun And Sandhya Theatre Controversy Episode | Sakshi
Sakshi News home page

ఇది సీఎం రేవంత్‌ వ్యూహంలో భాగమా?

Published Tue, Dec 24 2024 12:23 PM | Last Updated on Tue, Dec 24 2024 9:30 PM

KSR Comment On CM Revanth Reddy Allu Arjun Episode

రాజకీయ నేతలు తమకు లాభం ఉందనుకుంటేనే ఏదైనా వివాదాన్ని రేకెత్తిస్తుంటారు.  తమకు నష్టం చేస్తుందని భావిస్తే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలని కయ్యానికి దువ్వుతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఆక్రోశాన్ని బయటపెట్టాయనిపిస్తుంది.

రేవంత్ ను తెలివైన రాజకీయ నేతగానే అంతా చూస్తారు.కాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన అధికార దర్పమో,లేక ఎవరైనా సలహాదారుల ప్రభావమో కాని,అనవసర వివాదాలను తెచ్చి పెట్టుకుంటున్నారనిపిస్తుంది. బహుశా ఇది ఆయన వ్యూహం కావచ్చు.లేక సినిమావారిని తన దారిలో పెట్టుకోవాలన్న లక్ష్యం కావచ్చు. లేదా అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో సినీ పరిశ్రమవారు, ఇతర ప్రముఖులు  కలవడం పై ఆయనకు కలిగిన ఉక్రోశం కావచ్చు..ఏదైనా కావచ్చు.

రాజకీయంగా చూస్తే  ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన  హామీలను నెరవేర్చడంలో ఉన్న కష్టాలు కూడా ఒక  కారణం అనుకోవచ్చు.ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదో ప్రయత్నమా అన్న భావన కలగవచ్చు.  లేదా తాను ఎవరిపైన అయినా దూకుడుగా వెళ్లగలనని నిరూపించుకోవాలన్న తాపత్రయం కూడా ఇందులో ఉండవచ్చు. సంధ్యా ధియేటర్(Sandhya theater Incident) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనపై  అల్లు  అర్జున్‌ను  బాధ్యుడిని చేస్తూ రేవంత్ ప్రభుత్వం కేసు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆయనను అరెస్టు చేసింది.

ఈ క్రమంలో ఎక్కడా అర్జున్ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వెళ్లింది.సాధారణంగా పోలీసులు ఇలాంటి కేసులలో ముఖ్యమంత్రి ఏమి చెబితే అది చేస్తుంటారు. దానిని నిర్దారిస్తూ శాసనసభలో రేవంత్ ప్రసంగించినట్లు అనిపిస్తుంది.నిజానికి ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లింది.అలాంటప్పుడు ప్రభుత్వంలోని వారు కోర్టులో కేసు ఉంది కాబట్టి అని చెప్పి దాని గురించి  మాట్లాడకుండా తప్పించుకుంటారు.కాని రేవంత్ మాత్రం పనికట్టుకుని అర్జున్ ను తిట్టడానికే అవకాశం కల్పించుకున్నట్లుగా ఉంది.

శాసనసభ జరిగిన ఈ ఐదు రోజులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం, చివరి రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తడం,దానిపై రేవంత్ ఘాటుగా మాట్లాడడం చూస్తే అంతా ప్లాన్ ప్రకారమే సాగిందన్న అభిప్రాయం కలుగుతుంది.ఈ సందర్భంలో రేవంత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా?కిడ్ని పోయిందా?అంతమంది ఎందుకు పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు?అంటూ వితండ వాదన తీసుకు వచ్చారు.నిజానికి ఎవరిని ఇలా అనరాదు.అందులోను సెలబ్రెటిగా ఉన్న వ్యక్తి పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడవలసిన అవసరం ఏమిటో తెలియదు. అంటే అర్జున్ కు ఏదైనా జరగాలని కోరుకున్నట్లుగా ఉందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు.ఇక్కడే అసలు విషయం బోధ పడిందనిపిస్తుంది.

తన ప్రభుత్వం అర్జున్‌ను  అరెస్టు చేస్తే, ఆయనను  పలకరించడానికి ఇంత మంది సినీ పెద్దలు ఆయన వద్దకు వెళతారా?అన్న భావన  ఏదో ఏర్పడి ఉండాలి. చిరంజీవితో సహా అనేక మంది బంధువులు, రాఘవేంద్రరావు తదితర సినిమా పెద్దలు ఇలా కలిసినవారిలో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు  కూడా ఫోన్ చేసి పరామర్శించారని వార్తలు వచ్చాయి.ఈ పరామర్శల వల్ల  అర్జున్ పట్ల ప్రజలలో సానుభూతి ఏర్పడిందని అనిపించి ఉండాలి. అలాగే  ప్రభుత్వంపై నెగిటివ్ వచ్చిందని ఫీడ్ బ్యాక్ ఉండి ఉండాలి.

అందుకే  ఈ ఉదంతం జరిగిన పది రోజుల తర్వాత మళ్లీ తనది పైచేయి అనిపించుకోవడానికి రేవంత్ మాట్లాడినట్లుగా ఉంది.ఈ క్రమంలో అర్జున్‌ రోడ్ షో చేశారని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని,తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిందని తెలిసినా ,పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మరో వైపు అల్లు  అర్జున్ దీనిపై మీడియా సమావేశం పెట్టి తన వాదన తెలిపారు.అయితే ఆయన కాస్త జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేవంత్ పై నేరుగా ఎక్కడా విమర్శలు చేయకుండా మాట్లాడారు.తాను రోడ్ షో చేయలేదని,  పోలీసుల సూచన మేరకే చేతులు ఊపుతూ అబిమానులకు ఇబ్బంది లేకుండా చేయడానికి యత్నించానని వివరించారు.తనపై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

అర్జున్ ఈ తొక్కిసలాటకు తాను ఎలా కారణం అవుతానని చెప్పడానికి యత్నించారు.అలాగే మరణించిన మహిళ కుటుంబాన్ని, గాయపడ్డ వారి కుమారుడు శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లాలని అనుకుంటే తనపై కేసు పెట్టినందున అలా వెళ్లడం లీగల్‌గా  కుదరదని చెప్పారని ఆయన  వివరించారు.రేవంత్ చేసిన వాదనలో  హేతుబద్దత కనిపించదు. ఒక సినిమా నటుడు సినిమా ధియేటర్ కు వెళ్లకూడదన్నట్లుగా ఆయన మాట్లాడారు.  అదే సూత్రం కరెక్టు అని అనుకుంటే ఆయా ఉత్సవాలలో తొక్కిసలాటలు జరిగి కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి.

మరి ఆ ఉత్సవాలను పూర్తిగా నిలిపివేస్తున్నారా?ప్రముఖ  రాజకీయ నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు మరణించిన సందర్భాలు అనేకం   ఉన్నాయి. చేపమందు పంపిణీలో , నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్ లో గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి.అయినా వాటి నిర్వాహకులపై కేసులు పెట్టలేదే!అరెస్టులు చేయలేదే! మరి నేతలు రోడ్ షో లను ,సభలను ఆపివేస్తున్నారా.ఇక అర్జున్  ఎవరూ పరామర్శించకూడదని అనుకుంటే ఎలా? ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి కొన్నాళ్లు  జైలులో ఉన్నారు.ఆయన  బెయిల్ పై విడుదలయ్యాక చర్లపల్లి జైలు నుంచి ఊరేగింపుగా ఎందుకు వచ్చారు? అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అర్జున్‌ను  టార్గెట్ చేయడం సరికాదని బిజెపి నేతలు,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వ్యాఖ్యానించారు. రేవంత్ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు సభలలో తొక్కిసలాటలు జరిగి పదకొండు మంది మరణించారు. అయినా అప్పుడు అది పోలీసుల వైఫల్యం అని ఆయన  డబాయించారు.పు ష్కరాలలో ఆయన కుటుంబం స్నానాలు చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే  ఆయన  ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోండి.

కుంభమేళాలలో చనిపోవడం లేదా?రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా?పూరి జగన్నాధ్ రథం వద్ద తొక్కిసలాట జరగలేదా అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో రేవంత్ మాత్రం అర్జున్ దే  పెద్ద తప్పు  అన్నట్లు  మాట్లాడుతున్నారు.అర్జున్ ఒక్కరే కాదు..సినీ నటులంతా మొదటి షో కు వెళ్లి అబిమానులను ఉత్సాహపరుస్తుంటారు. బెనిఫిట్ షో లకుఅనుమతి ఇవ్వబోనని చెబుతున్నారు. తొలుత అధిక ధరలకు టిక్కెట్ అమ్ముకోవచ్చని అనుమతి ఇవ్వడానికి, ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వనని అనడానికి కారణాలు  ఉండాలి కదా? సినీ పరిశ్రమవారిని తనకు సరెండర్ అయ్యేలా చూసుకోవడానికి ఏమైనా రేవంత్ ఈప్రయత్నం చేస్తున్నారా అన్న  సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌కు ఇక్కడ టీడీపీ మీడియా మద్దతు  ఇస్తోంది కాబట్టి సరిపోయింది.లేకుంటే ఈ పాటికి సినిమా పరిశ్రమపై రేవంత్ దాడి చేశారని పెద్ద ఎత్తున  ప్రచారం చేసేది.  ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ల రేట్లు పెంపుదలకు కొన్ని షరతులు  పెడితేనే నానా యాగీ చేశాయి. పవన్ కళ్యాణ్ వంటివారు ఎన్ని ఆరోపణలు చేశారో చూశాం. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ప్రముఖ హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాటీడీపీ మీడియా కాని, పవన్ కళ్యాణ్ వంటివారు కాని నోరు విప్పడం లేదు.

వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు  కూడా చేయడం లేదు. ఎందుకంటే  రామోజీ  ఫిల్మ్ సిటీతో సహా సినీ పరిశ్రమ ఎక్కువగా ఇక్కడే ఉంది కనుక.రేవంత్ ఇంకేదైనా చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని భయపడుతుండవచ్చు.కాని సినీ పరిశ్రమకు రేవంత్ తెలియకుండానే నష్టం చేస్తున్నారు.ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఆయనకు అంత కలిసివచ్చేది కాకపోవచ్చు.  ఒకసారి కేసు  పెట్టాక దాని మానాన దానిని వదలివేయకుండా ఇలా కెలకవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఆయన మెప్పు కోసం  కొందరు అబ్బో అదిరింది అని పొగడవచ్చు. రేవంత్ ఫైర్ మాదిరి వ్యవహరిస్తున్నారని డబ్బా కొట్టవచ్చు.కాని తేడా వస్తే వీళ్లే ఘోరంగా ప్రచారం చేస్తారు. రేవంత్ సరళి ఫైర్ మాదిరి ఉంటే ఉపయోగమో,లేదో కాని, ఫైర్‌తో గేమ్ ఆడితే చేతులు కాలతాయన్న  సంగతి గ్రహించడం మంచిది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement