‘పచ్చ’ ముదురు రాతలు! | KSR Comments On Yellow Media Articles On SECI Agreement, Check More Details Inside | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ ముదురు రాతలు!

Published Mon, Nov 25 2024 11:33 AM | Last Updated on Mon, Nov 25 2024 5:43 PM

KSR Comment On Yellow Media Articles SECI Agreement

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా ఇంకోసారి భళ్లున కక్కినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఎల్లో మీడియా చిమ్ముతున్న విషం చూస్తే వారికి జగన్‌పై ఉన్న అక్కసో ఏ స్థాయిదో సామాన్యుడికీ తెలిసిపోతుంది. పిచ్చి ముదిరిందంటే.. రోకటికి చుట్టమన్నట్లు.. ఇప్పుడు వారు అమెరికా కోర్టుల తరఫున కూడా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ కోర్టులు ఏ రకమైన తీర్పులు ఇవ్వాలో ఈ మీడియా చెబుతూంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా స్థాయికి ఎదిగారన్నమాట. ప్రజలను మోసం చేసేందుకు వీరు కల్లుతాగిన కోతుల్లా అర్థంపర్థం లేని కథనాలు వండి వార్చారు.

అదానీ కంపెనీలకు చెందిన ఏడుగురిపై అమెరికా కోర్టులో ఒక కేసు నమోదైంది. సౌర విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారాయన్నది కేసులో మోపిన అభియోగం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్  ఇండియా (సెకి)తో కొన్ని భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాల వెనుక లంచాలు ఉన్నాయని ఆరోపణ. అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదానీతో నేరుగా ఒప్పందం చేసుకోలేదు. 

సెకీ ద్వారా తక్కువ ధరకే విద్యుత్తు కొనుగోలు చేస్తూంటే అధికారులకు ముడుపులు ఎలా చెల్లిస్తారన్న ప్రశ్న వస్తుంది. దీనికి సరైన సమాధానం ఈ పచ్చమీడియా ఇవ్వదు. పైగా.. అదాని కంపెనీ ఉద్యోగులపై మోపిన అభియోగాలను మాజీ సీఎం జగన్‌కు అంటకడుతూ ఎల్లోమీడియా చిందులు తొక్కింది. లంచాల ఆరోపణలే నిజమైతే అది ఏ రూపంలో జరిగిందో కూడా ఎల్లోమీడియా కథనాలు చెప్పాలి. అది మాత్రం వాటిల్లో ఉండదు. దీంతో ఈ కథనాల్లో వాస్తవికతపై సందేహాలు వస్తున్నాయి.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో భారత దర్యాప్తు సంస్థలపై మాదిరిగానే అమెరికాలోనూ విమర్శలు వస్తూంటాయేమో అన్న ఆలోచన వస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అమెరికాలోని చాలా కోర్టుల్లో ఆయనపై నమోదైన కేసుల్లో శిక్షల తీర్పులను నిరవధికంగా వాయిదా వేసుకోవడం ఇందుకు పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరూ అదానీపై లేదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీలను పల్లెత్తు విమర్శ కూడా చేయలేదు. అన్ని ఆరోపణలూ జగన్‌పైనే మోపుతూండటంలోనే వారి డొల్లతనం స్పష్టమవుతోంది.

ఈనాడు వంటి ఎల్లో మీడియా అశ్శరభ శరభ అంటూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇదే సంస్థ తన మార్గదర్శి కంపెనీలోకి రూ.800 కోట్ల నల్ల ధనం వచ్చి చేరిందని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ చెప్పినప్పుడు మాత్రం మాటమాత్రపు సమాధానమైనా ఇవ్వకుండా జారుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఈనాడు సోదర సంస్థ మార్గదర్శి చట్టాలతో సంబంధం లేకుండా రూ.2600 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేయడం తప్పా? కాదా? అని హైకోర్టు స్వయంగా ప్రశ్నించినా నిమ్మకు నీరెత్తినట్లు నీళ్లు నమిలిందే కానీ మాట పెగిల్చే ధైర్యం చేయలేదు. ఇతరుల విషయానికి వచ్చేసరికి మాత్రం పత్తిత్తు కబుర్లన్నీ చెబుతోంది. విలువలతో నిమిత్తం లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 

స్కిల్ స్కామ్ ఆరోపణలు చేస్తూ, సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాలోకే చేరిందని సీఐడీ ఆధార సహితంగా చెప్పినా.. అది అక్రమ కేసంటారు చంద్రబాబు. ఎల్లో మీడియా ఇదే ప్రచారం చేస్తుంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేసినా.. చంద్రబాబు జోలికి వస్తే ఊరుకోబోమని వీరు శివాలూగి పోతూంటారు. అంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని దర్యాప్తు సంస్థలనైతే మేము నమ్మమూ.. అమెరికా పోలీసులు చెబితే అదే వేదం మాకు అన్నట్టుగా ఉంది ఈ పచ్చమూక వ్యవహారం.

అదానీ కంపెనీపై మోపిన కేసు విషయానికి వస్తే.. అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను రాష్ట్రాలు సెకి ద్వారా తీసుకోని నేపథ్యంలో అదానీ గ్రూపు నేరుగా సంప్రదింపులు జరిపిందన్నది ఆరోపణ. ఇందులో తప్పేమిటి? ఇలా చేయడం వల్ల రాష్ట్రాలకు లాభం కలిగిందా లేదా? అన్నది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌తోపాటు చత్తీస్‌గఢ్‌, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌లు కూడా సెకితో మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి అదానీతో కాదు. ఈ రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒప్పందాలు కుదిరే సమయానికి కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం. 

ఆంధ్రప్రదేశ్‌కు సెకీ ఒప్పందం కారణంగా రూ.2.49లకే ఒక యూనిట్‌ సౌర విద్యుత్తు లభిస్తుంది. ఇంతే మొత్తం విద్యుత్తుకు అప్పటివరకూ ఐదు రూపాయల కంటే ఎక్కువ చెల్లిస్తూండేవారు. రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా అందించే విద్యుత్తు కోసం తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్‌ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇంకోలా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నమాట. ఒకవేళ ఈ ఒప్పందాల్లో ఏదైనా మతలబు ఉంటే అందుకు కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది!

ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటివారు ప్రధాని మోడీపై  విమర్శలు చేయగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను బాధ్యుడిని చేస్తూ, అవినీతి అవినీతి అంటూ పేజీలకు పేజీలు వార్తలిచ్చేశాయి. వీరి కథనాలే నిజమైతే.. ఇతర రాష్ట్రాల విషయంలోనూ కథనాలు ఇవ్వాలి కదా? కానీ వాటి గురించి పిసరంతైనా రాయలేదు.

దీన్నిబట్టే తెలిసిపోతుంది వారి కథనాలు అవాస్తవమూ అని. ఇక పార్టీ మారగానే స్వరమూ మార్చసిన మాజీ  మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి.... ఒకప్పుడు ఈనాడు మీడియా బాలినేని దారుణాతి దారుణంగా కథనాలు ప్రచురించింది. కానీ.. ఇప్పుడు వారికి బాలినేనిలో గొప్ప నిజాయితీ పరుడు కనిపిస్తున్నాడు. బాలినేని అసత్యాలు చెబుతున్న సంగతిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎండగట్టారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఉన్న అదాని నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని వారైనా ముడుపులు తీసుకునే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వ్యవహారలేవీ జరగవన్న విషయం పచ్చమీడియాకు తెలియదా?

అమెరికాలో సెక్యూరిటీల  ద్వారా నిధులు సమీకరించడానికి అదానీ గ్రూప్ ఈ అవినీతికి పాల్పడిందన్నది ఆరోపణ. అమెరికా అధికారులు సైతం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా కేవలం రాజకీయ లక్ష్యంతోనే ఈ అభియోగాలు కూడా మోపి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదానీతో ఏ ఒప్పందమూ చేసుకోనప్పుడు ముడుపుల అంశం ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్‌పై ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవమున్నా ఆయన ప్రధాన ప్రత్యర్ది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనపై విరుచుకుపడి ఉండేవారు. ఏదో మాట మాత్రంగా ఎల్లోమీడియా ప్రచారం కోసం జగన్‌పై నింద మోపారు. ప్రభుత్వ పరంగా అదానీ, జగన్‌లపై విచారణ  చేస్తామని చంద్రబాబు  ఎందుకు ప్రకటించలేదో ఎల్లో మీడియా తెలపాలి!.

అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే కొన్నిటి పనులు ఆరంభించింది.  జమ్మలమడుగు వద్ద పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు కూడా వీటిల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ సిబ్బందిపై లంచాలకోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మనుషులు అప్పట్లో  దాడి కూడా చేశారన్న వార్తలు వచ్చాయి. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకూ అదానీ సంస్థ ముందుకు వచ్చింది. 2014-19 టర్మ్‌లో రూ.70 వేల కోట్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే.. జగన్‌ ప్రభుత్వం దాన్ని రూ.14 వేల కోట్లకు తగ్గించిందని ఇదే ఈనాడు మీడియా విమర్శించింది. అంటే ఒక్క కంపెనీ ఏర్పాటుకు చంద్రబాబు రూ.70 వేల కోట్లకు ఓకే చేస్తే అది విజన్. గొప్ప విషయం. అదే జగన్ టైమ్‌లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడితో పది చోట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరిస్తే అదంతా అదానీకి రాసిచ్చినట్లు!!!

అదానీ తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలిస్తే అది ముడుపుల చర్చకు.. చంద్రబాబు కలిస్తే మాత్రం రాష్ట్రం కోసమన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతులు ప్రచారం చేస్తూంటాయి. అంతెందుకు... అదానీ గ్రూప్ ఎండీ రాజేశ్‌ అదానీ తదితరులు ఈ మధ్యే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఓడరేవులు, మైనింగ్, రింగ్ రోడ్డు,ఐటీ, టూరిజమ్‌, కృత్రిమ మేధ రంగాలతోపాటు అమరావతి నిర్మాణానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోందని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులన్నిటికి కలిపి ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది..? తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరస్కరించే ధైర్యం చేస్తుందా? అక్కడిదాకా కూడా అవసరం లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన సౌర విద్యుత్తు కొనుగోళ్ల అంశం తాలూకూ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఎల్లో మీడియా బాబును ఎందుకు కోరలేకపోయింది?

సౌర విద్యుత్తు యూనిట్‌ రూ.1.99కే దొరుకుతుంటే, జగన్ ప్రభుత్వం సెకీతో రూ.2.49లకు ఒప్పందం చేసుకుందని ఈనాడు మీడియా ఆరోపణ. అందులో ఏ మాత్రం నిజం ఉన్నా, చంద్రబాబు  ప్రభుత్వం వాటిని రద్దు చేయడానికి లేదా, ధర తగ్గించడానికి సెకీకి నోటీసు ఇవ్వవచ్చు కదా?గతంలో చంద్రబాబు యూనిట్‌ విద్యుత్తుకు ఏకంగా రూ.5 ఇచ్చి కొనుగోలు చేస్తే, జగన్ సెకీ ఒప్పందం ద్వారా యూనిట్ ధర 2.49 రూపాయలకు తగ్గిందం‍టే అది తప్పని ఎల్లో మీడియా ప్రచారం చేసింది.

పోనీ అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలో సత్యం ఉందని భావిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం వీరిపై, అలాగే మోడీ ప్రభుత్వంపై విచారణకు ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు కదా! ఆయన ఎక్కడా అదానీని కానీ, మోడీని కానీ ఒక్క మాట అనకుండా జగన్ వల్ల రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా? మరి స్కిల్ స్కామ్‌లో జర్మనీ కంపెనీ సీమెన్స్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన స్కామ్ వల్ల అప్రతిష్ట రాలేదా? చంద్రబాబుకు ముఖ్య స్నేహితుడు ఈశ్వరన్ తో అమరావతిని ప్రమోట్ చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తీరా చూస్తే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనివల్ల ఏపీ పరువుకు నష్టం జరగలేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలకు ఎవరు జవాబివ్వాలి? కేవలం జగన్ పై ద్వేషంతో మాట్లాడితే సరిపోతుందా? జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ఎల్లో మీడియా ద్వారా టీడీపీ రాజకీయం చేస్తున్నదన్నది అర్ధం కావడం లేదా?


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement