
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజలను రాచిరంపాన పెట్టిన ఇందిరాగాంధీ మనవడు తెలంగాణలో దొరల పాలన ఉందంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఏం వెలగబెట్టారని మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. నిజాం కబంధ హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించాడంటూ, ఇప్పుడు మరో గుజరాతీ తెలంగాణకు విముక్తి కలిగిస్తాడంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని..
మరోవైపు సోనియా తెలంగాణ ఇవ్వకపోతే బిర్లామందిర్, నాంపల్లిదర్గా దగ్గర అడుక్కునే వారంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు అంటున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద దాడి అని పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో... టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, భువనగిరి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీఓల మాజీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ తదితరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్‌ను చూసి ఆ పార్టీలకు భయం
కాంగ్రెస్‌కు బీటీమ్ అని ఒకరు, బీజేపీకి బీటీమ్ అని మరొకరు బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని.. ఎవరికో గులాములా ఉండాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారని ఆ రెండు పారీ్టలు భయపడుతున్నాయని.. అందుకే తెలంగాణలో తొక్కేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ గులాములు, గుజరాత్ బానిసలతో కేసీఆర్ చేస్తున్న పోరులో ప్రజలు ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలని కోరారు. సోనియాను బలిదేవత అని విమర్శించిన రేవంత్ ఇప్పుడు కాళీమాత అంటున్నారని.. ఇది హంతకుడే నివాళులు అర్పించినట్టుగా ఉందని విమర్శించారు.
అంతా కేసీఆర్ వెంట నిలవాలి..
‘‘తెలంగాణను ఆగం చేసేందుకు కొన్ని గద్దలు, తోడేళ్లు, నక్కలు ఎదురుచూస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారే మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను నక్కల పాలు చేయొద్దు. ఉద్యమ సమయంలో మనం చూపిన తెగింపు, చొరవ ఈ మధ్య కొంత మరిచిపోయినట్టు అనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం మీద దాడి జరుగుతుంటే తెగువలేనట్టు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పడి ఉందామా? జెండా ఏదైనా గుండెల నిండా తెలంగాణ పౌరుషం ఉండాలి.
అన్ని పార్టీల్లోని తెలంగాణ నాయకులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైందని.. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై దసరా పండుగ రోజు ఊరూరా చర్చ పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీపై ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే పూర్తవుతుందని హామీ ఇచ్చారు.
ముదిరాజ్‌లకు కేసీఆర్‌తోనే న్యాయం
ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బండా ప్రకాశ్‌ను రాజ్యసభ సభ్యుడిగా చేసినదే కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. ముదిరాజ్‌లకు కేసీఆర్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో వారికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇస్తారని చెప్పారు. కాగా.. రావుల చంద్రశేఖర్‌రెడ్డి చేరికతో మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్‌కు వంద ఏనుగుల బలం వచి్చందని, పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇస్తుందని కేటీఆర్ పేర్కొనగా.. పాలమూరు అభివృద్ధి కోసం తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు రావుల చెప్పారు.
ఇక పోగొట్టుకున్న చోటే గౌరవం, గుర్తింపు దక్కుతుందనే భావనతో తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరానని, ఉద్యమకారులు ఒకచోటకు వచ్చి తెలంగాణను రక్షించుకోవాలని జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యోగులు, పెన్షనర్లు, ముదిరాజ్ సామాజికవర్గం సేవ కోసం బీఆర్‌ఎస్‌లో చేరినట్టు మామిండ్ల రాజేందర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment