సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకుని పచ్చి బూతులు మాట్లాడటం భావ్యం కాదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధికారం అనేది ప్రజలు ఇస్తే వచ్చేదని, ప్రజల మనసు గెలుచుకోవడం ద్వారా మాత్రమే అధికారంలోకి వస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్లీనరీసందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
►‘మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని మిత్రులు అంటున్నారు. మహారాష్ట్ర సీఎంను దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా సీఎంను పట్టుకుని కొందరు 420 గాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.
►రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలి. ఉద్యమ సమయంలో ఉద్వేగంతో మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కుంభకోణాల నుంచి పుట్టిన వారు మన దగ్గర నాయకులు అయ్యారు.
►ఏపీలో ఒక సంఘటన జరిగింది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ బూతులేంటి? అక్కడ టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడులు ఎవరు చేశారు.. అనేది పక్కన పెడితే, దానికి మూలం ఎక్కడుంది? రాజకీయాల్లో ఎందుకు అసహనం?
►నువ్వు రాజకీయాల్లో ఓడిపోయావు.. సహనం పాటించు. ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం వద్దకు వెళ్లు.. బతిమిలాడుకో.. నీకు ఎందుకు ఓటు వేయాలో వివరించు. అంతే తప్ప దుగ్ధ ఎందుకు? అర్జంటుగా అధికారంలోకి రావాలన్న ఆరాటం, యావ ఎందుకు?
►ప్రజలు అధికారాన్ని వేరొకరికి ఇచ్చారు. ప్రజలు మమ్మల్ని కూడా 2009లో తిరస్కరిస్తే పోరాటం చేసి 2014లో అధికారంలోకి వచ్చాం. టీడీపీకి అక్కడ అధికారం పోయింది.. ఇక్కడ అంతర్ధానమైంది.
►మా పార్టీ కేవలం తెలంగాణ మీద మాత్రమే దృష్టి పెడుతుంది. మేము ఢిల్లీకి గులాములము కాదు. గుజరాత్‌కు బానిసలం కాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తలొగ్గుతాం. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసే సత్తా కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది. సార్వత్రిక ఎన్నికల లోపు పార్టీని దృఢంగా తయారు చేస్తాం.
►రెండు జాతీయ పార్టీలకు రాష్ట్రంలో ఇద్దరు కోతీయ అధ్యక్షులు వచ్చారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారు. నాగార్జునసాగర్‌లో బీజేపీకి డిపాజిట్ దక్కనట్లే, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పన్నాగాలను ప్రజలు చిత్తు చేస్తారు.
►టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తుందని రేవంత్‌రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదు. ‘గాంధీభవన్‌లో గాడ్సే దూరాడు’ అని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్ అన్నారు.
►మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ప్రభుత్వ కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాం. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాం.
సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్
Published Sat, Oct 23 2021 7:50 AM | Last Updated on Sat, Oct 23 2021 10:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment