ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతాం
గడిచిన ఏడాది బీఆర్‌ఎస్‌కు అత్యంత గడ్డుకాలం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
ఏడాది కాంగ్రెస్ పాలనపై షార్ట్ ఫిల్మ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ కోల్పోయింది అధికారాన్ని మాత్రమేనని.. పోరాటతత్వాన్ని కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీఆర్‌ఎస్ పారీ్టపై ప్రజలకు అభిమానం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘నమ్మి నానబోస్తే’ షార్ట్ ఫిల్మ్‌తో పాటు కాంగ్రెస్ పాలనపై రూపొందించిన ‘అంతా ఉత్తదే’ పాటను కేటీఆర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బీఆర్‌ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసు కుని 25వ ఏట అడుగుపెడుతోంది. గడిచిన ఏడాది పార్టీకి అత్యంత గడ్డుకాలం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్ తుంటి ఎముకకు గాయం, ఎమ్మెల్సీ కవిత అరెస్టు, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం వంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. బీఆర్‌ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ నేతల అరెస్టులకు కుట్రలు జరుగుతు న్నాయి. ఈ పరిణామాలన్నీ దాటుకుంటూ బీఆర్‌ఎస్ తిరిగి బలంగా నిలబడింది. ఇచి్చన హామీలను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదినే వ్యతిరేకత మూటగట్టుకుంది. ఉపఎన్నిక జరిగితే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరు’ అని అన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాం«దీభవన్ బోసిపోతుండగా.. విపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ మాత్రం నిత్యం కళకళలాడుతోందని తెలిపారు. ‘ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు రసమయి బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ అద్దం పట్టింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతీనెల షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించి విడుదల చేస్తానని రసమయి బాలకిషన్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎస్.మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రవిశంకర్, చిన్నయ్య, లింగయ్య, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ రాజయ్య, ఆనంద్, క్రాంతికిరణ్, ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.
భూసేకరణ రద్దయ్యే వరకు పోరు
లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు అయ్యేంత వరకు పోరాటం చేస్తామని, రైతులు, గిరిజనులకు అండగా నిలుస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. రైతులు, గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీతో టెలిఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్ పోలీసు వేధింపులు నిలిపివేయాలని కోరారు. లగచర్ల బాధితులు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు జైలులో ఉన్న బాధితులను బెయిల్‌పై తీసుకువచ్చేందుకు బీఆర్‌ఎస్ లీగల్ విభాగం సర్వశక్తులూ ఒడ్డుతోందని కేటీఆర్ చెప్పారు. లగచర్ల బాధితుల డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని ప్రకటించారు. భేటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment