సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, శనివారం మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకోవడం.. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు. అలాగే, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అంటూ కామెంట్స్ చేశారు.
No Law No Order
Have you ever seen such nonsense in last 10 years? https://t.co/nd4LP6P72n— KTR (@KTRBRS) June 23, 2024
ఇదిలా ఉండగా.. మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌లో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హెచ్‌ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా, శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భూమి ఉన్నది. ఇందులో గుడిసెలు వేసుకొని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచారు. దాదాపు 2వేల మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు.
అయితే, గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి.. హెచ్‌ఎండీఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీం కోర్టును ఆశ్రయించారని.. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment