హైదరాబాద్ పేదలకు రక్షణ కవచంలా నిలుస్తుంది: కేటీఆర్
మూసీ పరిసర ప్రాంతాలకు త్వరలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
గ్రేటర్ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట ప్రభు త్వం సృష్టిస్తున్న భయానక వాతావరణం నుంచి ప్రజలను బీఆర్‌ఎస్ రక్షిస్తుందని, సీఎం రేవంత్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. మూసీ పేరిట జరుగు తున్న లూటీని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైదరాబాద్ పేదలకు బీఆర్‌ఎస్ రక్షణ కవచంలా నిలుస్తుందని అన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లను బెది రించేందుకే హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పేదలను బెదిరింపులకు గురిచేస్తున్న ప్రాంతాల్లో త్వరలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తారని తెలిపారు. ఈ మేరకు షెడ్యూలును త్వర లోనే ప్రకటిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పేదలకు ఎవరూ అండగా లేరనుకుంటోంది..
‘పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఎవరూ అండగా లేరనే రీతిలో ప్రభుత్వం అనాలోచితంగా, ప్రణాళిక లేకుండా దూకుడుగా వ్యవహరిస్తోంది. 50 ఏళ్ల క్రితం అనుమతులు పొందిన ఇళ్లను కూడా కూల్చివేస్తామంటే కుదరదు. మా ఫార్మ్‌హౌస్‌లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చండి కానీ పేదల జోలికి వెళ్లొద్దు. హైడ్రా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేసేలా బీఆర్‌ఎస్ లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు.
మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?
‘మా ప్రభుత్వంలో మూసీ మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు రూ.4 వేల కోట్లతో ఎస్‌టీపీలను నిర్మించాం. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి నీళ్లు తేవడంతో పాటు నల్లగొండకు మంచినీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. అలాంటపుడు మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు? ఒకపక్క మూసీ సుందరీకరణ అంటూనే దామగుండం రాడార్ స్టేషన్ పేరిట 12 లక్షల వృక్షాలను ఎలా నరికేస్తారు?
బీజేపీ కంటే ఎక్కువ రేవంత్ మాట్లాడుతున్నాడు
దేశ రక్షణ విషయంలో బీజేపీ నాయకులకంటే ఎక్కువగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశ రక్షణకు బీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. 2017లో దామగుండం రాడార్ స్టేషన్ కోసం జీవో ఇచ్చినా పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను తొక్కి పెట్టాం. ప్రధానిని ప్రశ్నించాలంటే రేవంత్‌కు భయం. గతంలో కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగినా సీఎం మాట్లాడలేదు..’ అని కేటీఆర్ విమర్శించారు.
పది నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులు
‘అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రేవంత్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.80,500 కోట్లు అప్పు చేసింది. అప్పు తప్పు అని గతంలో ఆరోపించిన వారిని ఇప్పుడు దేనితో కొట్టాలి? రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా వేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, నెలల పాటు జీతాలు ఇవ్వకుండా రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’ అని మాజీమంత్రి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment