Labour Leader To Congress Chief Mallikarjun Kharge Political Jouney In Telugu - Sakshi
Sakshi News home page

కార్మిక సంఘం నాయకుడి నుంచి కాంగ్రెస్ అధినేత వరకు.. ఖర్గే ప్రస్థానమిదే..

Oct 19 2022 3:10 PM | Updated on Oct 19 2022 6:02 PM

Labour Leader To Congress Chief Mallikarjun Kharge Political Jouney - Sakshi

1942 జూలై 21న కర్ణాటక బీదర్‌లో జన్మించారు ఖర్గే. కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై 1969లోనే ఆ పార్టీలో చేరారు

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. 24 ఏళ్ల తర్వాత ఆ పదవి చేపడుతున్న గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. జగ్‌జీవన్ రామ్‌ తర్వాత కాంగ్రెస్ సారథి అయిన రెండో దళిత నేతగా నిలిచారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్లకుపైగా అనుబంధం ఉన్న ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం.

80 ఏళ్ల ఖర్గే.. 1942 జూలై 21న కర్ణాటక బీదర్‌లో జన్మించారు. కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై 1969లోనే ఆ పార్టీలో చేరారు. గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లహోతి కాలేజీలో లా చదివారు. జూనియర్‌ న్యాయవాదిగా ఉన్నసమయంలోనే కార్మిక సంఘాల కేసులను వాదించి గెలిచారు. 1969లోనే గుల్బార్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. 1972లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1973లో ఒక్ట్రోయి అబాలిషన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకలో మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడటానికి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక కీలకంగా వ్యవహరించింది. 

1976లో ప్రాథమిక విద్యా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 16,000కుపై ఎస్సీ,ఎస్టీ టీచర్ల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేశారు. దేవరాజ్ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా‌, గుండూరావు కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగాకూడా పనిచేశారు. ఎస్ఎం కృష్ణ హయాంలో హోంమంత్రిగా ఉన్నారు.

విజయాలు అలవాటుగా..
► ఖర్గేకు రాజకీయాల్లో విజయాలు అలవాటుగా మారాయి. 12 సార్లు ఎన్నికల్లో(అసెంబ్లీ, లోక్‌సభ కలిపి) పోటీ చేసిన ఆయన.. 2019 మినహా ప్రతిసారి ఘన విజయం సాధించారు. 2004లో కర్ణాటక అసెంబ్లీకి వరుసగా 8 సార్లు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత మరోసారి గెలిచి ఛితపూర్ అసెంబ్లీ నుంచి వరుసగా 9 సార్లు పోటీ చేసి గెలిచిన నేతగా రికార్డు నెలకొల్పారు. 
► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారు ఖర్గే. 2014-2019వరకు లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
► 2021 ఫిబ్రవరి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు ఖర్గే. అప్పటినుంచి 2022 అక్టోబర్ 1 వరకు రాజ్యసభ ప్రతిపక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన కారణంగా ఆ పదవికి రాజీనామా చేశారు.
చదవండి: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement