ముంబై: మహారాష్ట్ర ఎన్నికలు ఇద్దరు బిలియనీర్లు, పేదల మధ్య పోరుగా పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలోని భూమి అంతా తమ చేతుల్లోకి వెళ్లాలని ఆ బిలియనీర్లు కోరుకుంటున్నారని అంబానీ, అదానీలను పరోక్షంగా ఉద్ధేశిస్తూ విమర్శించారు. ఈ మేరకు ముంబైలో సోమవారం రాహుల్ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని మండిపడ్డారు. దీని వల్ల మహారాష్ట్రలో యువత ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు.
‘మహారాష్ట్ర రైతులు, పేదలు, నిరుద్యోగులు, యువతకు సహాయం అవసరం. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ఉచితంగా రూ.3000 జమ చేస్తాం, మహిళలకు, రైతులకు బస్సు ప్రయాణం, రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ.7వేలు మద్దతు ధర ఇస్తాం. తెలంగాణ, కర్ణాటకలో మాదిరి మహారాష్ట్రలో కూడా కులగణన పూర్తి చేస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి, దేశంలో కుల గణన నిర్వహిస్తాం’ అని తెలిపారు.
ఇక ఇటీవల ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే మనమంతా సురక్షితంగా ఉంటాం) అని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ పని చేస్తోంది. పేదల గురించి వారికి ఎలాంటి ఆలోచన లేదు. ధారావిలోని నివాసితుల ప్రయోజనాలను విస్మరించారు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రజలకు భూములను తిరిగి అప్పగిస్తుంది’’ అని రాహుల్ భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment