కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పట్టించుకోకుండా తన విధులను మర్చిపోయి, మున్సిపల్ ఎన్నికల్లో హోం మంత్రి బిజీగా ఉన్నారని విమర్శించారు. ‘ఇలాంటి హోం మంత్రిని ఎప్పుడూ చూడలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంటే, ఆయన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ, ప్రజలతో ఫోటోలు దిగతూ, వారి ఇంటికి వెళ్లి భోజనాలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మమత సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
ఇందుకు స్పందనగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బెంగాల్‌లో బయటి వారికి చోటులేదు. కొంతమంది బయటి నుంచి వచ్చినా సరే బెంగాల్‌ని ప్రేమతో ముందుకు నడిపించడంలో సాయం చేస్తారు. అలాంటి వారే మా స్నేహితులు. అంతేగానీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, కేవలం ఎన్నికల ముందు వచ్చే వారు బెంగాల్‌కి సంబంధించిన వారు కాదు. వారు ఎప్పటికైనా ఔట్‌సైడర్స్ గానే ఉంటారు" అని అన్నారు.
ఇక రాష్ట్రాన్ని "గుజరాత్ మోడల్"గా తీర్చిదిద్దుతామన్న బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యల నేపథ్యంలో.. "గుజరాత్ గుజరాత్‌గానే ఉండనివ్వండి. వారు బెంగాల్‌ను గుజరాత్‌గా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మత అల్లర్లను సృష్టించి బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చాల్సిన అవసరం లేదు. ఇది రవీంద్రనాథ్- నజ్రుల్ ఇస్లాం స్థలం. మత అల్లర్లతో కూడిన గుజరాత్ కాదు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్లోగన్’ గుర్తుచేస్తూ, ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్ మాత్రమే బీజేపీకి కావాలన్నారు. కానీ మన దేశం అందరి కోసం ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో వాళ్లు పాల్గొన్నారా? ఆ సమయంలో వారు దేశానికి ద్రోహం తలపెట్టారు’’ అని ముఖ్యమంత్రి మమత పేర్కొన్నారు.
రైతులకోసం నేను:మమతా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను నిరసిస్తూ వామపక్షాలు సమ్మె చేస్తున్న తరుణంలో తాము రైతులకు అండగా ఉంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ పార్టీ వారికి పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే రాష్ట్రంలో వ్యాపారానికి భంగం కలిగించడానికి సీపీఎంను అనుమతించదని స్పష్టం చేశారు. రైతుల పట్ల పోలీసుల చర్యలను తప్పుపడుతూ.. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ బిల్లులు ప్రవేశపెడుతూ వారి జీవానోపాధిని దెబ్బతీస్తుందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని ‘చట్టవిరుద్ధం ’అని పేర్కొంటూ రైతులు ఆహ్వానిస్తే వారితో కలిసి పోరాడతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment