
కోల్‌కతా: త్రిపురలో బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. త్రిపురలోని అగర్తలలో గాయపడిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో మమతా బెనర్జీ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని, ముఖ్యంగా త్రిపుర, అసోం, ఉత్తరప్రదేశ్‌లో అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఆదివారం త్రిపురలో కొందరు వ్యక్తులు.. సుదీప్, జయ అనే ఇద్దరు బెంగాల్ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని మండిపడ్డారు. పోలీసుల ముందే దాడి జరిగినప్పటికీ వారు పట్టించుకోలేదని, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించలేదని విమర్శించారు.
ఈ దాడుల వేనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని మమతా ఆరోపించారు. అందుకే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. ఇటీవల టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బేనర్జీ త్రిపురలోని అగర్తల పట్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొంతమంది కర్రలతో దాడి చేసి విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారని, వాటికి ఆయన బాధ్యతవహించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.