న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్న వేళ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి ఊరటనిచ్చే విషయాలు చెప్పారు. ఆయన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 200 సీట్లలో విజయం సాధించి బెంగాల్‌లో ఈసారి అధికారం చేపడుతామన్న అమిత్ షా పాచికలు పారవని అన్నారు. అక్కడ కనీసం రెండంకెల సీట్లు కూడా కాషాయ పార్టీ గెలుచుకోలేదని పీకే జోస్యం చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ఇప్పుడున్న దానికన్నా ఏమాంత్రం మెరుగ్గా మారిన తన స్థానాన్ని వదులుకుంటానని సవాల్ విసిరారు.
అనుకూల మీడియా ద్వారా బీజేపీ ఊదరగొట్టే ప్రచారాలు చేస్తోందని పీకే ఎద్దేవా చేశారు. అంతేగానీ, అక్కడ కమలం పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు. మమతా దీదీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజే పీకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక టీఎంసీ అసమ్మతి నేతలు రవాణాశాఖ మాజీ మంత్రి సువేందు అధికారి, మరో ఎంపీ సునీల్ కుమార్ మోండల్, మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ‘ఇది ఆరంభం మాత్రమే.. తృణమూల్ కాంగ్రెస్‌లో చివరకు మీరొక్కరే మిగిలుతారు’అని అమిత్ షా ఈ సందర్భంగా మమతాపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ఇదిలాఉండగా.. బెంగాల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 294.
(చదవండి: ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్’)
Comments
Please login to add a commentAdd a comment