ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీజేపీ, దాని మిత్రపక్ష ఎమ్మెల్యేలంతా హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం, నాయకత్వ మార్పు డిమాండ్‌పై వాళ్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నట్లు వరుస కథనాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా తప్పదనే ప్రచారం ఊపందుకుంది.
అయితే.. మణిపూర్‌లో నాయకత్వ మార్పు ప్రచారాన్ని బీరెన్ సింగ్ ఖండించారు. ఎమ్మెల్యేల పర్యటనకు, తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారాయన. కేవలం మణిపూర్ శాంతి భద్రతల అంశంపై చర్చించేందుకే వాళ్లు అక్కడికి వెళ్లారని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ సమావేశం జరగలేదని.. ఆ హడావిడి ముగిశాక తాను ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్యేలతో పాటే హైకమాండ్‌ను కలుస్తానని చెప్పారాయన.
2017లో మణిపూర్ సీఎం పదవి చేపట్టారు బీరెన్ సింగ్. అయితే ఆయన నాయకత్వంపై చాలా ఏళ్ల నుంచే అధికార కూటమి ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. మణిపూర్‌లో ఘర్షణలు.. హింస చెలరేగాక ఆయన్ని కచ్చితంగా తప్పించాలని సొంత పార్టీ నుంచే కాదు, మిత్రపక్షాలు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, జేడీయూలు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు కూడా. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం బీరెన్‌ను కొనసాగిస్తూ వస్తోంది.
అయితే.. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎమ్మెల్యేలంతా మరోసారి ఆ డిమాండ్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించాయట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారనే చర్చ నడుస్తోంది అక్కడ. మణిపూర్‌లో రెండు లోక్‌సభ సీట్లను బీజేపీ కోల్పోగా.. కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యేల పర్యటనపై బీరెన్ మరోలా స్పందించారు.
‘బీజేపీ, మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమే. కానీ ఈ పర్యటనకు.. నా మార్పునకు ఎలాంటి సంబంధం లేదు. మణిపూర్‌లో శాంతిభద్రతల్ని పరిరక్షించే విషయంలో ఎన్డీయే ఎమ్మెల్యేలతో పలుమార్లు భేటీ అయ్యింది. ఈ మధ్యే కేంద్రంలో మోదీ సర్కార్ మళ్లీ కొలువుదీరింది. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో మణిపూర్ అంశం కూడా ఉంది. అందుకే గురువారం రాత్రి బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కేంద్రం తరఫున మణిపూర్ శాంతిభద్రతల్ని పరిరక్షించాలని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్రహోం శాఖకు ఒక మెమొరాండం ఇవ్వాలని ఆ భేటీలో నిర్ణయించాం. దానిపై 35 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు. ఆ మెమొరాండాన్ని సమర్పించేందుకే వాళ్లు హస్తిన వచ్చారు. వాళ్లకు అపాయింట్‌మెంట్ కూడా దొరికింది. నేను కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. పార్లమెంట్ సమావేశాల హడావిడిలో ఢిల్లీ పెద్దల విలువైన సమయాన్ని వృధా చేయొద్దని మేమంతా ఆగాం. సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేల సమేతంగా నేనూ ఆ సమావేశానికి హాజరవుతా’’ అని బీరెన్ సింగ్ చెప్పారు.
మణిపూర్‌లో కిందటి ఏడాది మే నెలలో రిజర్వేషన్ల అంశంపై వర్గాల పోరుతో మొదలైన ఘర్షణలు.. నెలల తరబడి కొనసాగింది. ఈ హింసలో 200 మంది మరణించగా.. వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సీట్లు తగ్గడాన్ని మణిపూర్ అంశం కూడా ఒక కారణమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడింది. దీంతో.. ఎన్డీయే బలం 293కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment