
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాగా, సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ రూపాయి అడుగుతున్నాము. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలి. గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంచాలి. రాష్ట్రంలో నవోదయ, సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి.
గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ హయాంలో ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినా సీఎం కలిసే వారు కాదు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పని చేస్తాం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా కృషి చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సానుకూలంగా పరిష్కరించుకునేలా ముందుకు పోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment