సర్పంచులను పాడెనెక్కించిన ఘనత మీది
హరీశ్‌రావు విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావుకు పెండింగ్ బిల్లుల బాగోతం తెలుసు. అయినప్పటికీ పదేపదే వాస్తవాలను వక్రీకరించడం అంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది’ అని మంత్రి సీతక్క పేర్కొ న్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో సర్పంచులతో బలవంతంగా పనులు చేయించారు.. వందలకోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన సర్పంచులను పాడెనెక్కించింది మీరే’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘గ్రామ పంచాయతీల సమస్యలపై మీరు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే.
గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపి ఇప్పుడు నీతి సూక్తులు వల్లిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, పీఆర్ మంత్రిగా తనపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలపై ఆయా అంశాల వారీగా మంత్రి సీతక్క గురువారం ఓ ప్రకటనలో బదులిచ్చారు. పంచాయతీల బాగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఏళ్లుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో గ్రామపంచాయతీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
‘పంచాయతీలకు మేము ఏం చేశామో ప్రజలకు తెలుసు. 15వ ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి రూ.431.32 కోట్ల నిధులు విడుదల చేశాం. దీనికి అదనంగా రూ.323.99 కోట్ల సీఆర్‌డీ నిధులిచ్చాం. అయినా 9 నెలల్లో 9 పైసలు కూడా విడుదల చేయలేదని అనడం విడ్డూరంగా ఉంది’ అంటూ హరీశ్‌రావుపై సీతక్క ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment