సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. ఇంకా లక్షలాది మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం.
ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.
ఇక, మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీధర్ బాబు ప్రసంగం ఆపాలని కామెంట్స్ చేశారు. దీంతో, బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు. పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు. యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ సభ్యులపై స్పీకర్ కూడా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment