మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్
మీడియాతో చిట్‌చాట్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కీలకమైన జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీస్ చేపట్టలేదు
థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు
తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత లేదని సీడబ్ల్యూసీ అనలేదు
కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులైన అధికారులపై త్వరలో కేసులు పెడతామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన ‘జియోలా జికల్’ ప్రొఫైల్ స్టడీ లేకుండానే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అందువల్లే జియోలాజికల్ ప్రొఫైల్‌తో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)కి ఇవ్వలేకపోయాం. అంతేకాదు.. బ్యారేజీ నిర్మాణ సమయంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీకి తనిఖీలు నిర్వహించలేదు. అందువల్ల ఈ వివరాలను కూడా ఎన్డీఎస్ ఏకు ఇవ్వలేకపోయాం..’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎన్డీఎస్‌ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా చారం ఇవ్వలేదని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందంటూ కాంట్రాక్టర్‌కు తప్పుడు మార్గంలో సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటి వెనక ఏదో మతలబు ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. బ్యారేజీలోని ప్రతిబ్లాక్ నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్లను గత ప్రభుత్వం సిద్ధం చేయలేదని.. అందుకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను ఎన్డీఎస్‌ఏకు అందజేయలేదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ ఎన్డీఎస్‌ఏకు రాతపూర్వకంగా కూడా తెలిపామన్నారు. ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ సలహా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని చెప్పారు.
అధికారులపైనా క్రిమినల్ కేసులు..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఉత్తమ్ తెలిపారు. బాధ్యులైన అధికారులను గుర్తించి, వారి పేర్లతో సహా నివేదిక ఇస్తామని విజిలెన్స్ చెప్పిందని.. ఆ తర్వాత వారిపై క్రిమినల్ కేసులు ఉంటాయని వెల్లడించారు. గత ఏడాది వరదల్లో నీట మునిగి దెబ్బతిన్న కన్నెపల్లి పంపుహౌజ్ పునరుద్ధరణ తమ ప్రభుత్వం వచ్చాక పూర్తయిందని చెప్పారు. ‘‘తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ తేల్చినట్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది.
కమీషన్ల కోసమే బ్యారేజీ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చింది. ఇదే విషయాన్ని వెదిరె శ్రీరామ్ కూడా చెప్పారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఎంత పెంచితే అంత కమీషన్లు వస్తాయని కుట్రపూరిత ఆలోచనతో గత సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నెల రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించనుందని.. ఆ తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్డీఎస్‌ఏ ప్రక్రియను వేగిరం చేయాలని కోరేందుకు తాను ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నానని తెలిపారు.
బీఆర్‌ఎస్ కారు స్క్రాప్‌కే..
శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం బీఆర్‌ఎస్ నేతలతో వెళ్తున్న బస్సు టైర్ పేలిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘బీఆర్‌ఎస్ కారు టైర్లు బరస్ట్ అయ్యాయి. ఇక తుక్కు కింద పోవాల్సిందే..’’ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నష్టాన్ని చూశాకైనా బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
కాళేశ్వరంలో కేంద్రం పాపం తక్కువేం కాదు..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేసిన పాపం తక్కువేమీ కాదని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ పెట్టుబడి అను మతులు ఇవ్వలేదని వెదిరె శ్రీరామ్ అంటు న్నారని.. మరి ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, బ్యాంకులు ఎలా ఇచ్చా యని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టు డిజైన్లు సరిగ్గా లేవని వెదిరె శ్రీరామ్ అంటున్నారని.. మరి ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఏఐబీపీ పథకం కింద రూ.2,500 కోట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌కు మరమ్మతులు చేపడ తామని, ఇందుకు సీఆర్పీఎఫ్ బలగాలను తొల గించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment