
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు’అమలు చేయాలంటూ బండి సంజయ్ డప్పు కొట్టాల్సింది హైదరాబాద్‌లో కాదని, దేశవ్యాప్త అమలు కోసం ఢిల్లీలో మోగించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలయ్యేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ వెంటాడుతుందని హెచ్చరించారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై ఊరూరా డప్పుల దండోరా వేస్తామన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని, మంగళవారం ఆ పార్టీ నిర్వహించిన ‘డప్పులమోత’లో ఏ ఒక్కరూ డప్పు వాయించే వారు లేరని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఎక్కడైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. దేశంలో కుల వివక్ష పోగొట్టే ప్రయత్నం చేయకపోగా బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న గారడీ వేషాలు మానుకోవాలని, ‘దళితబంధు’కు అడ్డుపడితే ఊళ్లలోకి రాకుండా ప్రజలు తొక్కిపెడతారని హెచ్చరించారు.
చదవండి: Congress: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడనున్న మరో కీలక నేత..!
కేసీఆర్‌ను జైలుకు పంపి మనుగడ సాధిస్తారా?
‘కేసీఆర్ సహకారం లేకుండా కేంద్రంలో బీజేపీ పాలనే సాగించలేదు. కేసీఆర్‌ను జైలుకు పంపి బీజేపీ మనుగడ సాధిస్తుందా?’అని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ది గెలుపు కాదు, వాపు అన్నారు. కాంగ్రెస్‌తో బీజేపీ అపవిత్ర కలయికతో ఈటల గెలుపొందారని విమర్శించారు. కేంద్ర మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించి చంపడమే దేశంలో రాక్షస పాలనకు ఉదాహరణ అని మోత్కుపల్లి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment