భువనేశ్వర్: పూరీ జిల్లా పిప్పిలి శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక ముఖచిత్రం స్పష్టమవుతోంది. ఈ నియోజక వర్గంలో త్రిముఖ పోటీ తప్పనట్లు కనిపిస్తోంది. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ పిప్పిలి నియోజకవర్గంలో సిగపట్లు పట్టనున్నాయి. బీజేడీ, బీజేపీ ఒకరి తర్వాత ఒకరుగా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఈ రెండు పార్టీల కంటే ముందుగా గెలుపు అవకాశాలు ఉన్న ముగ్గురు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోవడంపట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీజేడీ నుంచి రుద్రప్రతాప్
అధికార బీజేడీ పార్టీ అభ్యర్థిగా రుద్ర ప్రతాప్ మహారథిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం ఖరారు చేసి ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి కుమారుడు రుద్రప్రతాప్ మహారథి. త్వరలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.
నాన్న కల సాకారం చేస్తా: రుద్ర ప్రతాప్ మహారథి
తల్లిదండ్రులు, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆశీస్సులతో పిప్పిలి ఉప ఎన్నిక టికెట్ లభించడం అదృష్టం. ముఖ్యమంత్రి నమ్మకం వమ్ము కాకుండా నాన్న కలను సాకారం చేసే దిశలో కృషి చేస్తానని రుద్ర ప్రతాప్ మహారథి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
పిప్పిలి ఉపఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆశ్రిత్ పట్నాయక్ తొలుత నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. తొలుత 2014వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల ఓట్లు సాధించారు. రెండో సారి 2019వ సంవత్సరంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 72 వేల ఓట్లు సాధించారు. 15 వేల 787 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలైనప్పటికీ అధికార పక్షం బిజూ జనతా దళ్ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ తరఫున ఆశ్రిత్ పట్నాయక్ తగిన అభ్యర్థిగా అధిష్టానం నిర్ధారించి టికెట్ కేటాయించింది.
భారీ ఊరేగింపు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సమీర్ మహంతి, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఊరేగింపుగా బయల్దేరి పూరీ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ టికెట్ రేసులో ముగ్గురు
కాంగ్రెస్ టికెట్ కోసం ప్రాథమికంగా ఖరారైన అభ్యర్థుల జాబితాలో నిషికాంత మిశ్రా అగ్రస్థానంలో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో అజిత్ మంగరాజ్, పూర్ణ చంద్ర స్వంయి ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి కాంగ్రెస్ టికెట్ లభిస్తుంది.
చదవండి: పిప్పిలి సమరానికి కసరత్తు..
Comments
Please login to add a commentAdd a comment