
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, ఆయన ఏమాత్రం నమ్మదగిన నేత కాదని జమ్మూ–కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. దాదాపు ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం విధించిన గృహ నిర్బంధం నుంచి విడుదల అయిన ఆయన ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వంటి అంశాల్లో వివిధ పార్టీల వైఖరి ఎలా ఉందన్న ప్రశ్నలపై స్పందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజకీయ అవసరాలకు, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తమను వాడుకున్న చంద్రబాబు తమ రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు స్పందించకుండా ముఖం చాటేశారని మండిపడ్డారు. ‘2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని, ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తున్నారని అందరికీ తెలుసు. మా నాన్న ఫరూక్ అబ్దుల్లా తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో ప్రచారాన్ని విడిచిపెట్టి ఏపీకి వచ్చి చంద్రబాబు పార్టీ కోసం ప్రచారం చేశారు. మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదీ ఆయన నైజం..’ అని పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా ఇంకా ఏమన్నారంటే..
► ఓటర్లను టీడీపీకి అనుకూలంగా ప్రభావితం చేయడానికి మా నాన్నను చంద్రబాబు ఏపీలో ప్రచారానికి ఆహ్వానించారు. చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని తెలిసినా మా నాన్న ప్రచారం చేశారు. అందుకోసం తాను పోటీ చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో కీలక సమయంలో ప్రచారాన్ని విడిచిపెట్టి మరీ ఏపీ వెళ్లారు.
► కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అన్యాయంగా గృహ నిర్బంధంలో దాదాపు ఏడాదిపాటు ఉంచితే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
► ఆయన కోసం మేం అంతచేస్తే మా రాష్ట్రం కోసం, మాకు నైతిక మద్దతు ఇచ్చేందుకు బాబు ఒక్కమాట కూడా మాట్లాడలేరా?
► మాకు మద్దతు ఇచ్చేందుకు శ్రీనగర్ రావాలని ఆయన అనుకోలేదు. కనీసం ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చేందుకైనా ప్రయత్నించలేదు.
► కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడ్డుకుని ఉంటే అది వేరు. అప్పుడు మా రాష్ట్రానికి మద్దతు లభిస్తోందని దేశానికి తెలుస్తుంది. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. ఆయన విశ్వాసఘాతకుడు.
► భవిష్యత్‌లో చంద్రబాబుగానీ ఆయన లాంటి నేతలను గానీ నమ్మేది లేదు. వారికి ఏ విషయంలోనూ మద్దతుగా
నిలిచేది లేదు.
Comments
Please login to add a commentAdd a comment