
లక్నో: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక డీలాపడ్డ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కంటే వెనుకంజలో నిలిచింది. మొత్తం 3,050 స్థానాలకు గాను బీజేపీ మద్దతుదారులు కేవలం 599 స్థానాల్లోనే గెలిచారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 790, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)354 సీట్లల్లో పాగా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో జెండా ఎగురవేసింది. 1,247 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీని ప్రజలు తిరస్కరించడం గమనార్హం. కీలకమైన జిల్లాల్లో ఆ పార్టీ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న ఆరోపణలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇకమీదట అయినా మేల్కోనకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పార్టీ సీట్లు
బీజేపీ 599
ఎస్పీ 790
బీఎస్పీ 354
కాంగ్రెస్ 60
ఇతరులు 1,247
మొత్తం 3,050
Comments
Please login to add a commentAdd a comment