సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన గ్యారెంటీల అమలు ఎపట్టి నుంచి అనేది తెలుసుకోవడానికి ప్రజలు వేచిచూస్తున్నారు.
గ్యారెంటీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్సుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.4వేల పెన్షన్,రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు రూ.2500 నగదు బదిలీ, రూ.500కు గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
వీటితో పాటు బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే. అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి చర్యలపై గవర్నర్ ఏదైనా వెల్లడిస్తారా అనే చర్చ జరుగుతోంది.
కాగా, గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది మరుసటి రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ తొలి చర్చలోనే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలో మాటల తూటాలు పేలే ఛాన్సుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్‌లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీంతో చర్చ వాడివేడిగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment