కలెక్టర్ల సమావేశంలోనూ హామీల ప్రస్తావన లేదు
మాజీమంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు నెలలుగా అంబేడ్కర్ రాజ్యాంగం బదులు.. నారా లోకేశ్ ప్రకటించిన రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడే పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందని ఆయనన్నారు. గతంలో ఎప్పుడూలేని పోకడలు రెండు నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీ, బిహార్‌లో ఇలా ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామని.. ఇప్పుడా పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందని.. చివరకు వారిపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నోరు మెదపడంలేదని ఆక్షేపించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమని చెప్పారు. ‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఓ రిటైర్డ్ డీజీపీ, రిటైర్డ్ ఐజీ ఇద్దరూ కలిసి అమలుచేస్తున్నారు.
జగ్గయ్యపేటలో గంజిపల్లి శ్రీనివాస్‌పై పచ్చమూకలు అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాయి. సీతారామాపురం హత్య ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలి. ఇక వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో నాటి సీఎం జగన్ పార్టీలకతీతంగా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలుచేయాలని చెప్పారు. కానీ, సోమవారం నాటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాజకీయ పార్టీ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment