
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో అల్పాహార విందు, సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ఎంపీలు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూడు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ స్థితిగతులపై ప్రధాని ఆరా తీశారు.
అదే సమయంలో పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తమదైన ముద్ర వేసుకున్న బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలోపేతం చేసేందుకు కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. తెలంగాణలో ప్రతిపక్షం కాంగ్రెస్, ఏపీలో ప్రతిపక్షం టీడీపీ క్షేత్రస్థాయిలో పట్టును కోల్పోతున్న పరిస్థితుల్లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఏవిధంగా అందిపుచ్చుకోవాలన్న దానిపై చర్చించారు. ఇందు కేంద్ర ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.