సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం సోమవారం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా అభివృద్ది చేసిన ప్రతిష్టాత్మక ఆస్తులను తెగనమ్ముతోందంటూ బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. ప్రధాని మోదీ తన స్నేహితులైన పరిశ్రమ పెద్దలకు ఆస్తులను కట్టబెడుతున్నారంటూ మంగళవారం మీడియా సమావేశంలో రాహుల్ మోదీపై విరుచుకు పడ్డారు.
కేవలం ఇద్దరు ముగ్గురు బడా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తాజా ప్రణాళికలని రాహుల్ గాంధీ విమర్శించారు. కోట్లాదిమంది పౌరులకు ఉపయోగకరంగా ఉండే రైల్వేలను ఎందుకు ప్రైవేటీ కరిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోర్టులు, విమానాశ్రయాలు ఎవరు పొందుతున్నారో గమనించాలంటూ బడా కంపెనీలను గుర్తుచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు ప్రజాధనంతో నిర్మించిన బంగారం లాంటి ఆస్తులను మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని రాహుల్ ధ్వజమెత్తారు. జాతీయ మానెటైజేషన్ పైప్‌లైన్ ద్వారా మోదీ తన పారిశ్రామిక స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదు,కానీ కీలక పరిశ్రమలను ఎప్పుడూ తాము ప్రైవేటీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ ఏం అమ్ముతోందో, ఏ ఆస్తి ఎవరికి చేరుతోంది యువతకు తాను చెప్పాలనుకుంటున్నానని రాహుల్ తాజాగా వెల్లడించారు.
దేశ భవిష్యత్తుపై భారీ ప్రభావం
ముఖ్యంగా కరోనా గురించి తాను హెచ్చరించినపుడు అందరూ నవ్వారు. కానీ చివరికి ఏం జరిగిందో మీరే చూశారని రాహుల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళిక దేశ భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల రంగాలలో ప్రైవేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయడం, కీలక రంగాల్లో గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని, తద్వారా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌పై కేంద్ర మాజీమంత్రి పీచిదంబరం కూడా మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ ఆస్తులను నిర్మించాయనే విషయాన్ని బీజేపీ ఇప్పటికైనా గుర్తించాలని కాంగ్రెస్ సీనియర్ శశి థరూర్ ట్వీట్ చేశారు.
At least now, BJP should acknowledge that national assets were created since independence by successive @incIndia govts so that today's BJP goverment can sell them to overcome the financial mess created in last 7 years of their misgovernance! https://t.co/lVJP2Jcnfc
— Shashi Tharoor (@ShashiTharoor) August 24, 2021
Comments
Please login to add a commentAdd a comment