సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరగిందంటూ టి. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఇవాళ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఈ పంచాయితీలో.. ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు.
సోమవారమంతా జగిత్యాల కేంద్రంలో హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో.. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో జీవన్ రెడ్డి సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా తనకు మద్దతుగా గాంధీభవన్‌కు రావాలంటూ ఆయన పిలుపు ఇవ్వడంతో.. అక్కడే ఆయనతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని అంతా భావించారు.
ఈలోపు ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఉదయం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హుటాహుటిన నగరంలోని జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ చేసి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జీవన్‌రెడ్డిని కోరారు. తాను హైదరాబాద్‌కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
‘‘నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. నా ప్రమేయం లేకుండా జరగాల్సిందంతా జరిగింది. నేను పార్టీ మారను. ఏ పార్టీ నుండి నాకు కాల్స్ రాలేదు. బీజేపీ నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు. నన్ను ఏ పార్టీ ప్రభావితం చేయలేదు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. నాతో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ మాట్లాడారు. నిన్నటి నుండి మంత్రులు మాట్లాడుతున్నారు’’ అని జీవన్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
జీవన్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
శ్రీధర్ బాబు దౌత్యం విఫలం?
సంజయ్ చేరిక ఎపిసోడ్‌లో.. సోమావారమంతా జీవన్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై నిరసనగా కార్యకర్తల భేటీలోనే జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నం చేశారు. అయితే జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి, కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. దీంతో.. ఆయనను ఒక్కరోజు గడువుకోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.
నన్ను సంప్రదించకుండా ఎలా?
జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం.
మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్
జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment