వారిద్దరూ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులే. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరమో ఎమ్మెల్సీ. ఇద్దరూ కలిసి పనిచేస్తే గులాబీ పార్టీకి అక్కడ తిరుగే ఉండదు. కానీ.. ఆ ఇద్దరికి అసలు పడదు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుటి వైరమే బీఆర్ఎస్‌లోకి వచ్చాక కూడా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు నేతల తీరు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధిని మార్చాల్సిందే అని నియోజకవర్గ నేతలు పట్టుపడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడేం జరుగుతోంది?..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారా స్దాయికి చేరింది. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడ పార్టీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. 2014లో ఓడిపోయిన జైపాల్‌యాదవ్ కల్వకుర్తి నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. కసిరెడ్డి స్దానికసంస్దల ఎమ్మెల్సీగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి కల్వకుర్తి సీటు ఆశించారు. కానీ.. జైపాల్‌యాదవ్‌కే అవకాశం ఇచ్చింది. మరోసారి ఆయన ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు..
నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశంలోనూ ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు సాగుతోంది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కసిరెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు కూడా చేస్తున్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోఉన్న బీఆర్ఎస్‌కి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడ తలనొప్పిగా తయారైంది. ఒకరికి సీటు ఇస్తే ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులంతా కూడా జైపాల్‌యాదవ్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జైపాల్‌యాదవ్‌కు సీటు ఇస్తే సహకరించేది లేదని వారంతా హెచ్చరిస్తున్నారు.
డిమాండ్ ఇదే..
ఇటీవల కసిరెడ్డి నారాయణరెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పలు తీర్మానాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా జైపాల్‌యాదవ్‌కు ఈసారి సీటు ఇస్తే సహకరించవద్దని నిర్ణయం తీసుకున్నారట. కసిరెడ్డికి సీటు ఇస్తే కలిసి పనిచేసి గెలిపిస్తామని.. ఆయనకు కాదంటే మరో బీసీ నాయకుడికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం జైపాల్‌యాదవ్‌కు సీటు ఇస్తే తమందరి తరపున స్వతంత్ర అభ్యర్దిని బరిలో దింపే యోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. గతంలో కూడ జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి.
టెన్షన్‌లో పార్టీ కేడర్..
సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇస్తామని సీఎం ప్రకటించటంతో ఈసారి తనకే వస్తుందనే ధీమాలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో ఉద్యమకాలం నుంచి పనిచేసిన గోలి శ్రీనివాస్‌రెడ్డి కూడ వనపర్తి సీటు కోరుతున్నారు. మొత్తంగా గులాబీ పార్టీలో నెలకొన్న వర్గపోరు కొంప ముంచేలా ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.
ఇది కూడా చదవండి: TS Election 2023: 'ఈవీఎం'లపై ఓటర్లకు అవగాహన తప్పనిసరి..
Comments
Please login to add a commentAdd a comment