అన్ని పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికే వాడుకుంటున్నాయి. ఫలితంగా ఏళ్లు గడుస్తున్నా పసుపు రైతుకు న్యాయం జరగడం లేదు. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ‘మద్దతు’ కోసం అన్నదాతలు ఏటా ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు. పసుపు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతాంగం తెర తీస్తోంది. దీన్ని అవకాశంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
సాక్షి, నిజామాబాద్: పసుపు రైతులు మళ్లీ దగా పడుతున్నారు. ఈసారి కూడా సరైన మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు. మరో పక్షం రోజుల్లో పసుపు సీజను ఊపందుకోనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పారీ్టలు పసుపు రైతుల సమస్యలపై దృష్టి సారించాయి. పసుపుబోర్డు, కనీస మద్దతు ధర విషయంలో ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు అన్ని పక్షాలు ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ బాండ్‌పేపర్‌పై టీఆర్‌ఎస్..
పసుపుబోర్డుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని టీఆర్‌ఎస్ మండిపడుతోంది. పసుపుబోర్డు విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఎంపీ అర్వింద్ విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే పసుపుబోర్డు ప్రకటించాలని కోరుతున్నారు.
రాష్ట్ర సర్కారు పైకి నెట్టేస్తున్న బీజేపీ
పసుపునకు మద్దతు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ ఇప్పిస్తే మద్దతు ధర విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒప్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ ప్రకటించారు. మరోవైపు, పసుపుబోర్డుకు మించే స్పైసిస్‌బోర్డు రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెబుతున్నారు.
ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్
పసుపు రైతుల సమస్యలపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇప్పటి వరకు పసుపు రైతుల సమస్యలను పెద్దగా పట్టించుకోని ఆ పార్టీ.. ఇప్పుడు పసుపునకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ నెల 30న ఆర్మూర్‌లో ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment