లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం
రైతుల ముసుగులో అధికారులపై బీఆర్‌ఎస్ ప్రేరేపిత దాడి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో అమాయక రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు బీఆర్‌ఎస్ ప్రయతి్నస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్‌ఎస్ గుర్తించాలని, పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టొద్దని గురువారం ఒక ప్రకటనలో ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని విమర్శించారు.
కలెక్టర్‌పైనే హత్యకు భారీగా కుట్ర పన్నారని, రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనివెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, స్థానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కుట్రపూరిత చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. రైతులకు నష్టం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అధికారులపై దాడి జరిగినట్టుగానే భవిష్యత్‌లో రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.
ప్రజలను కాపాడుకున్నట్టే, అధికారులను కాపాడుకోలేకపోతే పనిచేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేశారని గుర్తు చేశారు. ఇసుక దందాలకు అడ్డువస్తున్నారని, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని నేరెళ్లలో దళితులను ట్రాక్టర్‌తో తొక్కించి పోలీస్‌స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్ నెలలో వేములఘాట్ రైతు తూటుకూరి మల్లారెడ్డి, కూలి్చవేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి, దానినే చితిగా మార్చుకొని ఆత్మార్పణ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. గడచిన 11 నెలలుగా ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు.
మహారాష్ట్రకు పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గురువారం నాందేడ్ ప్రాంతంలో జరిగిన పలు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు వచి్చన రాహుల్‌గాం«దీకి నాందేడ్ విమానాశ్రయంలో మంత్రి ఉత్తమ్‌తో కలిసి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment