
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమంపై మాట్లాడే అర్హత టీడీపీ నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులను చంద్రబాబు అంటరాని వారిగా చూసి కేబినెట్‌లో కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్ల పాలనలో గిరిజనులను అవమానించి, వారి హక్కులను కాలరాసిన చంద్రబాబును గిరిజనుల ద్రోహిగా అభివర్ణించారు. జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునః సమీక్ష చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గిరిజనుల తరఫున ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసిందని తెలిపారు.
సుప్రీంకోర్టులో ఆ జీవో కొట్టేయడానికి చంద్రబాబే కారణమని అందరికీ తెలుసన్నారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామని, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశామని, ఈ ఏడాది సబ్ ప్లాన్ కింద రూ.5,177 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ, పాడేరులో గిరిజన మెడికల్, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలలు, సాలూరులో గిరిజన యూనివర్సిటీ, అరకులో గిరిజన స్టేట్ యూనివర్సిటీ, ఐదు ఐటీడీఏల పరిధిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్న సీఎంగా వైఎస్ జగన్ గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని కొనియాడారు.