
దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను చూపుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. ఈ హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే తనతోపాటు జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి చేసిన ప్రసారాల్లో వాస్తవాలు లేవన్నారు. ఆయన మంగళవారం ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడారు. తామంతా వైఎస్‌తోపాటు వివేకానందరెడ్డితో కలిసి పనిచేశామన్నారు. శాంతి కపోతానికి మారుపేరుగా నిలిచిన వివేకానందరెడ్డిని అత్యంత క్రూరంగా హత్య చేయడాన్ని జిల్లా ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.
బాధితులైన వైఎస్ కుటుంబ సభ్యులనే హత్యకు బాధ్యులను చేయడం మనసును కలచివేస్తోందన్నారు. 164 స్టేట్‌మెంట్‌ను చూపుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆదివారం తెల్లవార్లూ బ్రేకింగ్ న్యూస్ పెట్టిందని, డీపీ నేతలతో డిబేట్ నిర్వహించిందని చెప్పారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమామహేశ్వరరెడ్డి.. వివేకానందరెడ్డితో కుటుంబ సభ్యులుగా వ్యవహరించేవారని తెలిపారు. సునీల్‌యాదవ్ ఆక్రోశంతో బండబూతులు తిట్టి దస్తగిరి చేతిలోని గొడ్డలిని తీసుకుని నరికాడన్నారు. ఈ హత్య వెనుక పెద్ద తలకాయలున్నాయని ఎర్రగంగిరెడ్డి చెప్పారని, అది వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డేనని ఏబీఎన్‌లో నిర్ధారించారని పేర్కొన్నారు. ఎర్రగంగిరెడ్డి సిట్, సీబీఐ దర్యాప్తులో ఎక్కడా వారిపేర్లు ప్రస్తావించలేదన్నారు. దస్తగిరి సైతం సిట్ దర్యాప్తులో వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించలేదని, రెండున్నరేళ్ల తర్వాత వారి పేర్లు చెబుతున్నారన్నారు.
దస్తగిరిని మేనేజ్‌చేసి కేసు మలుపు తిప్పుతున్నారు
సాధారణ ఎన్నికలకంటే ముందే వివేకానందరెడ్డి హత్య జరిగిందని, సిట్ అధికారిగా అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం నియమించిన అభిషేక్ మహంతి విచారణ చేశారని చెప్పారు. ఏడాదిపాటు ఆయన చేసిన విచారణలో ఎక్కడా వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు రాలేదన్నారు. కొంతమంది వెనుక ఉండి దస్తగిరిని మేనేజ్‌చేసి కేసును మలుపుతిప్పుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, అప్పటికే వివేకానందరెడ్డి ఆయన కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని గుర్తుచేశారు.
వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత పీఏ కృష్ణారెడ్డి సెల్‌ఫోన్, లెటర్ పోలీసులకు అప్పగించలేదన్నారు. మొదట 174 సెక్షన్ కింద అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి రాత్రికి 302 కింద హత్యకేసుగా మార్చారని చెప్పారు. వైఎస్ కుటుంబ సభ్యులు ఈ హత్య చేసి ఉంటే గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఇంతకంటే మించిన గొప్ప బ్రహ్మాస్త్రం ఉంటుందా అన్నారు. గొర్రెతోక పట్టుకుని సముద్రాన్ని ఈదాలంటే కుదరదని చెప్పారు. దస్తగిరిలాగే ఎర్రగంగిరెడ్డిని కూడా అప్రూవర్‌గా మార్చి కేసు మలుపు తిప్పే అవకాశం ఉందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో డబ్బు ఎర్రగంగిరెడ్డిదని, దస్తగిరిని ప్రలోభపెట్టాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment