సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం తెలంగాణలో ప్రవేశించింది. తెల్లవారుజామున కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యర్మ రస్ నుంచి పాదయాత్ర ప్రారంభమై.. ఉదయం 6.30 గంటల సమయంలో సరిహద్దుల్లోని కృష్ణా బ్రిడ్జి మీదుగా నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళాబృందాలతో, కార్యకర్తలు, అభిమా నులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఐదు కిలోమీటర్లు నడిచి..
భారీ స్వాగత కార్యక్రమాల అనంతరం రాహుల్ పార్టీ శ్రేణులు, అభిమానులతో పాదయాత్రగా బయలుదేరుతారు. ఐదు కిలోమీటర్లు పాదయాత్ర సాగించి ఉదయం 11 గంటల సమయంలో గూడబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్‌కు చేరుకుంటారు. టైరోడ్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. తిరిగి ఈ నెల 27న రాష్ట్రానికి చేరుకుని పాదయాత్రను కొనసాగిస్తారు.
ఘనంగా స్వాగత ఏర్పాట్లు..
ఆదివారం ఉదయం రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు టీపీసీసీ ఘనంగా స్వాగతం పలకనుంది. స్వాగత కార్యక్రమాలతోపాటు రాహుల్ అక్కడే అల్పాహారం తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం యాత్ర కొనసాగనుంది. మార్గం వెంట తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మలు, గిరిజన నృత్యాలు, కోలాటాలు, ఇతర కళా బృందాలతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తొలిరోజు రాహుల్ ప్రసంగించే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో రాహుల్ యాత్రకు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను రూపొందించింది. ప్రతి పాయింట్‌కు ఇన్‌చార్జులను, రోజువారీ సమన్వయకర్తలను నియమించి ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కీలక కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ నాయకులు తెలంగాణకు రానున్నారు.
అన్ని వర్గాలు, రంగాల వారితో మాట్లాడుతూ..
రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మతాలకు చెందిన పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాల ప్రముఖులతో భేటీ కాను న్నారు. పలువురు రాహుల్‌తో కలసి యాత్రలో నడవనున్నారు. యాత్ర మధ్యలో దేవాలయాలు, మసీ దులు, చర్చిలు, ఇతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను కూడా సందర్శించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
యాత్ర జరిగే ప్రాంతాలివే..
- నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టే రాహుల్ యాత్ర.. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పురా, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా (ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో) సాగనుంది.
- హైదరాబాద్‌లో ఆరాంఘర్, చార్మినార్, మోజంజాహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెస్ రోడ్, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల మీదుగా జరుగుతుంది.
ఇప్పటివరకు 2,325 కిలోమీటర్లు
- సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తిరిగి కర్ణాటక మీదుగా 45 రోజులుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటివరకు సుమారు 2,325 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. తెలంగాణలో విరామాలు సహా మొత్తం 16 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
భారతీయులంతా ‘జోడో’ యాత్రలో పాల్గొనాలి: రేవంత్
భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారు మధ్యలో జడ్చర్లలో కాంగ్రెస్ నాయకులతో కాసేపు సమావేశమయ్యారు. తర్వాత గూడబల్లేరుకు చేరుకున్నారు. నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి తదితరులతో కలిసి.. యాత్ర రాష్ట్రంలోకి వచ్చే కృష్ణా బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు, టైరోడ్‌లో తెలంగాణ తల్లి విగ్రహం, రాహుల్ మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ బస్సు, హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రాంతాలు, మతాలు, కులాలు, భాషల మధ్య చిచ్చుపెడుతోందని.. బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తోందని మండిపడ్డారు. ఈ పరిస్థితి మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
యాత్ర ఇలా..
- 23న ఆదివారం ఉదయం 6.30 గంటలకు తెలంగాణలో ప్రవేశించనున్న జోడో యాత్ర
- తొలిరోజు 5 కిలోమీటర్లు నడక.. దీపావళి పండుగ నేపథ్యంలో 3 రోజులు విరామం
- తిరిగి 27 నుంచి మొదలుపెట్టి నవంబర్ 7 వరకు యాత్ర. 4వ తేదీన విరామం
- రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాల మీదుగా 375 కిలోమీటర్ల యాత్ర
- పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా పయనం.. ఉదయం, సాయంత్రం నడక.. మధ్యలో భోజన విరామం, కార్నర్ మీటింగ్‌తో రోజువారీ షెడ్యూల్.
Comments
Please login to add a commentAdd a comment