
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు జైరాం ఇతర నేతలతో మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ వర్సెస్ ప్రజలు అన్న రీతిలో ఎన్నికలు జరిగాయన మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇది మోదీ వ్యతిరేక తీర్పు అని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
ఈసారి ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని, ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశామని, తమ పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు రాహుల్ గాంధీ. ఎన్నికలకు ముందు తమ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారని, సీఎంలను జైలుకు పంపారని ప్రస్తావించారు. అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగానే పనిచేశాయని అనఆరు. కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుతంగా పోరాడిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో తొలి విజయం సాధించామని పేర్కొన్నారు. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇండియా కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తామని చెప్పారు.
కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చార్యానికి గురిచేశాయి. 400పైగా సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చిన బీజేపీ.. 300 లోపు స్థానాలతోనే సర్ధిపెట్టుకుంది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిపక్ష కూటమి పుంజుకుంది. 232 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment