
తెలంగాణ ఉద్యమంలో ఆయనో ప్రత్యేకత సాధించారు. తన పాటతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. కాని గ్రామాల్లో ఎదురవుతున్న వ్యతిరేకత ఆయన్ను షాక్‌కు గురిచేస్తోంది. నియోజకవర్గంలోని కీలక నేతలకు ఆ ఎమ్మెల్యేతో పొసగడంలేదట. మొత్తంగా పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది?
అంతా బానే ఉంది.. మళ్లీ తనదే గెలుపు.. ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టేయడమేనని భావించారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ, అక్కడ సీన్ రివర్సవుతోంది. క్యాడర్ బలంగానే ఉన్నా.. నియోజకవర్గంలోని ఆ క్యాడర్ ను సమన్వయం చేసే కీలక నేతలతోనే బాలకిషన్‌కు బెడిసికొట్టింది. రసమయి వైఖరి నచ్చక అధికార బీఆర్ఎస్ నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ వంటి పథకాలు తమ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అందలేదంటూ ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారధి చైర్మన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రసమయికి ప్రస్తుతం తన నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రసమయిపై అలక పూనిన ఇల్లంతకుంట మండలం ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మానకొండూరు ఎంపీపీ ముద్ధసాని సులోచన శ్రీనివాస్ రెడ్డితో పాటుగా పలు గ్రామాల నాయకులు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో బాటలోనే గన్నేరువరం, కేశవపట్నం ఎంపీపీలు కూడా రాజీనామాలు చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరంతా మానకొండూరు నియోజకవర్గంలోని మండలాల్లో కీలక ప్రజాప్రతినిధులు. అక్కడి ఓటర్లను ప్రభావితం చేసి రేపటి ఎన్నికల్లో కారు పార్టీకి ఉపయోగపడేవారు. కానీ, వీరెవ్వరికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయితో పొసగకపోవడంతో.. మానకొండూరు బీఆర్ఎస్ లో క్యాడర్ ఉన్నా.. స్థానికంగా లీడర్స్ కరువవుతున్న పరిస్థితి కళ్లకు కడుతోంది.
గ్రామాల్లో ప్రచారం చేస్తున్న రసమయి బాలకిషన్‌కి అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసమో.. లేక ప్రభుత్వ పథకాలపైనో నిరసనల పర్వం ఎదురవ్వడం సర్వసాధారణమైపోయింది. రెండు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోనూ ప్రభుత్వ పథకాలైన దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ వంటివి తమ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఇవ్వలేదంటూ అక్కడికొచ్చిన ఎమ్మెల్యే రసమయిపై జనం తిరగబడ్డారు. దాంతో ఖంగుతిన్న రసమయి ఏంచెప్పాలో తెలియక పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. తన గెలుపుపై రసమయికి ధీమా ఏర్పడింది.
ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. తన హవా ఉంటుందన్న నమ్మకం మాత్రం రసమయిలో కనిపించేది. కానీ, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఇంతకాలం బీఆర్ఎస్ లో ఉన్న ఆరెపల్లి మోహన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు స్థానికంగా మంచి పట్టుండటం..మానకొండూరు బీజేపీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో.. ఇప్పుడు రసమయిలో కాసింత టెన్షన్ మొదలైంది. మొత్తంగా మానకొండూరులో రసమయి అగ్నిపరీక్షలను ఎలా ఎదుర్కొంటారు? సవాళ్లన్నింటినీ ఛేదించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించగలరా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment