Manukondur
-
ప్రతికూల పరిస్థితుల మధ్యే హ్యాట్రిక్ విజయంపై ఫోకస్
తెలంగాణ ఉద్యమంలో ఆయనో ప్రత్యేకత సాధించారు. తన పాటతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. కాని గ్రామాల్లో ఎదురవుతున్న వ్యతిరేకత ఆయన్ను షాక్‌కు గురిచేస్తోంది. నియోజకవర్గంలోని కీలక నేతలకు ఆ ఎమ్మెల్యేతో పొసగడంలేదట. మొత్తంగా పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది? అంతా బానే ఉంది.. మళ్లీ తనదే గెలుపు.. ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టేయడమేనని భావించారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ, అక్కడ సీన్ రివర్సవుతోంది. క్యాడర్ బలంగానే ఉన్నా.. నియోజకవర్గంలోని ఆ క్యాడర్ ను సమన్వయం చేసే కీలక నేతలతోనే బాలకిషన్‌కు బెడిసికొట్టింది. రసమయి వైఖరి నచ్చక అధికార బీఆర్ఎస్ నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ వంటి పథకాలు తమ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అందలేదంటూ ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారధి చైర్మన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రసమయికి ప్రస్తుతం తన నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రసమయిపై అలక పూనిన ఇల్లంతకుంట మండలం ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మానకొండూరు ఎంపీపీ ముద్ధసాని సులోచన శ్రీనివాస్ రెడ్డితో పాటుగా పలు గ్రామాల నాయకులు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో బాటలోనే గన్నేరువరం, కేశవపట్నం ఎంపీపీలు కూడా రాజీనామాలు చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరంతా మానకొండూరు నియోజకవర్గంలోని మండలాల్లో కీలక ప్రజాప్రతినిధులు. అక్కడి ఓటర్లను ప్రభావితం చేసి రేపటి ఎన్నికల్లో కారు పార్టీకి ఉపయోగపడేవారు. కానీ, వీరెవ్వరికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయితో పొసగకపోవడంతో.. మానకొండూరు బీఆర్ఎస్ లో క్యాడర్ ఉన్నా.. స్థానికంగా లీడర్స్ కరువవుతున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. గ్రామాల్లో ప్రచారం చేస్తున్న రసమయి బాలకిషన్‌కి అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసమో.. లేక ప్రభుత్వ పథకాలపైనో నిరసనల పర్వం ఎదురవ్వడం సర్వసాధారణమైపోయింది. రెండు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోనూ ప్రభుత్వ పథకాలైన దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ వంటివి తమ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఇవ్వలేదంటూ అక్కడికొచ్చిన ఎమ్మెల్యే రసమయిపై జనం తిరగబడ్డారు. దాంతో ఖంగుతిన్న రసమయి ఏంచెప్పాలో తెలియక పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. తన గెలుపుపై రసమయికి ధీమా ఏర్పడింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. తన హవా ఉంటుందన్న నమ్మకం మాత్రం రసమయిలో కనిపించేది. కానీ, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఇంతకాలం బీఆర్ఎస్ లో ఉన్న ఆరెపల్లి మోహన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు స్థానికంగా మంచి పట్టుండటం..మానకొండూరు బీజేపీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో.. ఇప్పుడు రసమయిలో కాసింత టెన్షన్ మొదలైంది. మొత్తంగా మానకొండూరులో రసమయి అగ్నిపరీక్షలను ఎలా ఎదుర్కొంటారు? సవాళ్లన్నింటినీ ఛేదించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించగలరా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. -
విద్యార్థినితో ఇన్విజిలేటర్ అనుచిత ప్రవర్తన
ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది. సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పరీక్ష నిర్వహించాల్సిన ఇన్విజిలేటర్ విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించడంతో బాధితురాలు తాను చదివే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చే సింది. ఈ మేరకు యాజమాన్యం సదరు అధ్యాపకుడిని పిలిపించి మందలించగా, విద్యార్థులు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతు న్న విద్యార్థిని జేఎన్టీయూ నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది. ఇదే మండలంలోని మరో ప్రైవేటు కళాశాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. రోజులాగే సోమవారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా, ఇన్విజిలేటర్‌గా బి.వెంకటేశ్‌ను కేటాయించారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన సదరు ఇన్విజిలేటర్ పరీక్ష రాస్తున్నంత సేపు తనను వేధించినట్లు విద్యార్థిని తెలిపింది. అవసరం లేకున్నా తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని, పరీక్ష పూర్తయ్యే సమయంలో ఫోన్ నంబర్ ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురించి మంగళవారం తాను చదివే కళాశాల యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కళాశాల చైర్మన్ అధ్యాపకుడిని కళాశాలకు పిలిపించి మందలించారు. విషయం తెలిసి అక్కడికి చేరిన విద్యార్థులు సదరు అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. చైర్మన్ పోలీసులకు సమాచారం అందించడంతో గొడవ సద్దుమణిగింది. అధ్యాపకుడిని ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు
సాక్షి, మానకొండూర్( కరీంనగర్) : వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కాసేపట్లో పెళ్లి తంతు పూర్తయ్యేలోగా ప్రియుడి తరఫు వారు అడ్డుకోవడంతో కథ మలుపు తిరిగింది. ఈక్రమంలో ప్రియుడు పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఇంటి నుంచి కనబడకుండా వెళ్లిపోగా, ఆ యువతి రెండునెలల పాటు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందె. చివరికి గ్రామ పెద్దలు రాజీకుదుర్చడంతో మూడున్నర నెలలు ఉత్కంఠతకు తెరపడింది. పెళ్లి ఆగిన చోటనే ప్రేమికులు గ్రామ పెద్దల సమక్షంలో బుధవారం ఒక్కటయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెల్ధి గ్రామానికి చెందిన అంతగిరి నందిని, అదే గ్రామానికి చెందిన ఎనగంటి శ్రీధర్ ప్రేమించుకున్నారు. గత మార్చిలో తిమ్మాపూర్ మండలంలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ లోపే అబ్బాయి తల్లీదండ్రులు ఆలయానికి వచ్చి శ్రీధర్‌ను తీసుకెళ్లారు. మరుసటి రోజు అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అప్పటి సీఐ ఇంద్రసేనారెడ్డి ఇరుకుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ నిర్వహించిన మరుసటి రోజునుంచే శ్రీధర్ కనిపించకుండా పోయాడు. ప్రియుడు ఇంటి ఎదుట యువతి 59 రోజుల పాటు ధర్నా చేసింది. గ్రామస్తులు, కులసంఘాలు, నాయకులు మద్దతు తెలిపారు. ప్రియుడు, అతడి తల్లీదండ్రులు మాత్రం ఇంటికి రాలేదు. పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గ్రామంలో పెద్దలు ఇరుకుటుంబాలతో సంప్రదింపులు జరిపారు. చివరికి శ్రీధర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. బుధవారం గ్రామస్తులు సమక్షంలో తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమయింది. -
ఫెయిల్ కావడంతో.. ఆపై...
శంకరపట్నం(మానకొండూర్) : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో ఆదివారం బీటెక్ విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమాడి కావ్యారెడ్డి(19) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల ప్రథమసంవత్సర పరీక్షలు రాసింది. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. అదే విధంగా వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన ఓ యువకుడు కావ్యారెడ్డి సెల్‌కు మెసేజ్ పంపడంతో 20రోజుల క్రితం ఇంట్లోవారు యువతిని మందలించారు. రెండు విషయాల్లో మనస్తాపం చెంది కొద్దికాలంగా మనోవేదనతో ఉంటోంది. తండ్రి సంపత్‌రెడ్డి ఆదివారం సోదరుడి వివాహానికి ఊరెళ్లాడు. తల్లి ఇంట్లోనే ఉంది. ఈ తరుణంలో కావ్యారెడ్డి బాత్రూంలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పొగలు రావడంతో గమనించిన తల్లి చుట్టపక్కల వారిని పిలిచింది. వారు వచ్చేసరికే పూర్తిగా కాలిపోయి మృతిచెందింది. ఎస్సై ఎల్లాగౌడ్ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
భార్యను హత్యచేసి..ఆపై ఆత్మహత్య
శంకరపట్నం(మానకొండూర్) : అనుమానం.. కుటుంబకలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హతమార్చి.. ఆపై తానూ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గం తిరుపతికి అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 25 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. జల్సాలకు అలవాటుపడిన తిరుపతి.. కొన్నేళ్లక్రితం అదే గ్రామానికి చెందిన గౌరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ ఆరేళ్లపాటు ఉన్నాడు. గౌరమ్మకూ ఓ కూతురు ఉంది. రెండోవివాహం చేసుకున్నప్పటినుంచీ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. తిరుపతి ధనలక్ష్మిని తరచూ అనుమానిస్తుండేవాడు. ప్రతిసారీ భార్యతో గొడవపడేవాడు. దీంతో ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ శివారులోని రేకుర్తికి గౌరమ్మతో కలిసి మకాం మార్చిన తిరుపతి.. కొద్దిరోజులు కూరగాయలు విక్రయించాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. రెండేళ్ల క్రితం గౌరమ్మ బావిలో శవమై తేలింది. తిరుపతి వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లోనే స్థానికులు చర్చించుకున్నారు. పిల్లలిద్దరూ దూరంగా.. తిరుపతి మొదటిభార్య కుమారుడు గణేశ్ గ్రామంలోనే వైండింగ్ పనులు చేసేవాడు. ఏడాదిక్రితం అదే గ్రామానికి చెందిన శ్రావ్యతో పెళ్లయ్యింది. శ్రావ్య హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేస్తుండడంతో కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కూతురు నిహారిక హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో బీటెక్ చదువుతోంది. రెండో భార్య కూతురు వివాహం.. అంతలోనే సంఘటన దారుణంగా హత్య.. దుర్శేడ్ వెళ్లి ఇంటికి చేరకున్న తిరుపతి, ధనలక్ష్మి సోమవారం రాత్రి గొడవపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన తిరుపతి.. నిద్రిస్తున్న ధనలక్ష్మిని గొడ్డలితో నరికాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం..తానూ క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మంగళవారం ఉదయం 7గంటలకు అదే గ్రామానికి చెందిన పోచయ్య వెళ్లి చూసేసరికి ఇంటిముందు తిరుపతి.. ఇంట్లో మంచంపై ధనలక్ష్మి శవాలై కనిపించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ అడిషనల్ సీపీ సంజీవ్‌కుమార్, ఏసీపీ కృపాకర్, హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్, ఎస్సై ఎల్లాగౌడ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రైన్లో హైదరాబాద్ వెళ్తున్న కుమారుడు, కూతురుకు సమాచారం చేరవేశారు. గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎవుసం యమపాశమై..
అల్గునూర్(మానకొండూర్) : భూమిని నమ్ముకున్న ఆ రైతుకు వ్యవసాయం కలిసిరాలేదు. దీంతో పగబట్టిన ప్ర కృతికి ప్రాణాలు ఫణంగా పెట్టాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బుధవారం జరిగింది. ఆధ్యాంతం విషాదం... గ్రామానికి చెందిన పాగాల మల్లారెడ్డి(58)కి భార్య అం జవ్వ, కుమారుడు కొండాల్‌రెడ్డి, కుమార్తె కోమల ఉన్నా రు. తనకు సాగుభూమి లేకున్నా 20 ఏళ్లుగా పలువురి భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్లక్రితం సిద్దిపేటకు చెందిన వ్యక్తితో కూతు రు వివాహం జరిపించాడు. పెళ్లయిన తర్వాత భర్త పెట్టే వేధింపులు భరించలేక ఏడాదికే కోమల ఆత్మహత్య చేసుకుంది. దీంతో మల్లారెడ్డి కుంగిపోయాడు. 20 ఎకరాలు కౌలుకు... క్రమంగా కోలుకున్న ఆయన ఏడాది తర్వాత మళ్లీ నాగ లి పట్టాడు. గ్రామానికి చెందిన పిన్నింటి నర్సింహారెడ్డికి చెందిన 20 ఎకరాల భూమి ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. కొడుకు కొండాల్‌రెడ్డి సహాయంతో సాగుచేస్తున్నాడు. మొదటి రెండేళ్లు అడపాదడపా కురిసిన వర్షాలకు దిగుబడి తక్కువగానే వచ్చి ంది. అయినా ఈ ఏడాదైనా కలిసిరాకుండా పోతుందా అన్న నమ్మకంతో రెండేళ్లుగా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కూరగాయల పంటలు సాగుచేశాడు. ఇందు కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున గడిచిన రెండేళ్లలో రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పెరిగిన అప్పులు.. గతంలోనూ రూ.2 లక్షల అప్పులు ఉన్నాయి. వరుస కరువొచ్చినా.. భూ యజమానికి రూ.1.50 లక్షలు కౌలు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితమే ఈ ఏడాది కౌలు డబ్బులు రూ.లక్ష చెల్లించాడు. మరో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.10లక్షలకు చేరడంతో మల్లారెడ్డి మనస్తాపం చెందాడు. పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి.. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి 7:30 గంటలకు వెళ్లాడు. 9 గంటలకు పొలంలో పడిపోయి ఉన్న మల్లారెడ్డిని రైతు మధుకర్ చూశాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అ ందించాడు. వారు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గా విలపించారు. ఎస్సై నరేశ్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహంతో రాస్తారోకో మల్లారెడ్డి మృతదేహంతో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో 45నిమిషాలపాటు గ్రామస్తులు, అఖిల పక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మల్లారెడ్డికి 3 ఎకరాల భూమి, 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్కపల్లి సంపత్, సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి కేదారి, మొగిలిపాలెం ఉపసర్పంచ్ మోరపల్లి రమణారెడ్డి డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎల్ఎండీ ఎస్ఐ నరేశ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కరీంనగర్ నుంచి స్పెషల్ఫోర్స్ను పిలిపించారు. కరీంనగర్ వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు, తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ శవాన్ని ఆంబులెన్స్‌లో గ్రామానికి తరలించి, నాయకులను ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రహదా రిని దిగ్భందించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ రాస్తారోకోలో పాల్గొన్న వారిపై తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గోల్డ్ పాలిష్ పేరుతో ఛీటింగ్
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్) : ఆభరణాలకు మెరుగుపెడతామంటూ కొందరు దుండగులు బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నాం ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉండే సిర్రా కొమురవ్వ అనే మహిళ ఇంటి వద్దకు చేరి ఆభరణాలకు మెరుగుపెడతామంటూ కోరారు. ముందు ఆమె కాళ్ల పట్టీలను మెరుగుపెట్టాక.. అక్కడే ఉన్న మరికొందరు మహిళలతో వాళ్ల మెడలోని గొలుసులను కూడా ఇస్తే పాలిష్ చేస్తామన్నారు. దీంతో కొమురవ్వతోపాటు మమత, కనకమ్మ అనే మహిళలు తమ మెడలోని బంగారు గొలుసులను వారికిచ్చారు. వాటిని ఓ గిన్నెలో వేసి అరగంట తర్వాత తీసుకోమంటూ సూచించి వారు వెళ్లిపోయారు. సమయం గడిచాక అందులో గొలుసులు లేకపోవటంతో మోసపోయామని గుర్తించి లబోదిబోమంటూ స్థానిక పోలీసుల ఆశ్రయించారు. తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ రావు . స్థానిక ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలో తతంగం అంతా రికార్డ్ కావటంతో ఆ దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.