గోల్డ్ పాలిష్ పేరుతో ఛీటింగ్
Published Fri, Aug 25 2017 7:50 PM | Last Updated on Tue, Sep 12 2017 1:00 AM
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్) : ఆభరణాలకు మెరుగుపెడతామంటూ కొందరు దుండగులు బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నాం ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉండే సిర్రా కొమురవ్వ అనే మహిళ ఇంటి వద్దకు చేరి ఆభరణాలకు మెరుగుపెడతామంటూ కోరారు.
ముందు ఆమె కాళ్ల పట్టీలను మెరుగుపెట్టాక.. అక్కడే ఉన్న మరికొందరు మహిళలతో వాళ్ల మెడలోని గొలుసులను కూడా ఇస్తే పాలిష్ చేస్తామన్నారు. దీంతో కొమురవ్వతోపాటు మమత, కనకమ్మ అనే మహిళలు తమ మెడలోని బంగారు గొలుసులను వారికిచ్చారు. వాటిని ఓ గిన్నెలో వేసి అరగంట తర్వాత తీసుకోమంటూ సూచించి వారు వెళ్లిపోయారు. సమయం గడిచాక అందులో గొలుసులు లేకపోవటంతో మోసపోయామని గుర్తించి లబోదిబోమంటూ స్థానిక పోలీసుల ఆశ్రయించారు. తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ రావు . స్థానిక ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలో తతంగం అంతా రికార్డ్ కావటంతో ఆ దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Advertisement