సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌కు ప్రజాక్షేత్రంలో పోటీ చేసే సత్తా లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు చంద్రబాబును ఛీత్కరించారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కుప్పంలో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతగా హామీలను అమలు చేస్తున్నారు. ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది. గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు. బాబు రాజకీయ జీవితం ముగిసిపోయే సమయం వచ్చింది. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్య ఓటమి అంటారు. వైఎస్సార్ సీపీ గెలిస్తే అక్రమం అని గగ్గోలు పెడుతున్నారు. మా పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ( ‘బాబు ఎందుకు కేంద్రానికి లేఖ రాసే ధైర్యం చేయడం లేదు’ )
బాబు నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారు. కుమారుడిలో పార్టీ నడిపే సామర్థ్యం కనపడకపోవడంతో ఆయన ఇలా తయారయ్యాడు. పళ్లు పట పటా కొరకడమేంటి?.. ఆ మనిషి అలా ఊగిపోవడం ఏమిటి?. 2424 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. మరికొంత మంది మా పార్టీ రెబల్స్ గెలిచారు. కేవలం 527 పంచాయతీల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా వెబ్ సైట్లో వివరాలున్నాయి. మీకు దమ్ముంటే అవి తప్పు అని నిరూపించండి. కక్కలేక మింగలేక ఆయన మీడియా అష్టవంకర్లు తిరుగుతోంది. కొన్నాళ్లు ఇలానే సాగితే ఊపిరి ఆగి పోయేటట్లున్నారు. బాబు ఒక మామూలు మనిషిగా ఉండటానికి కూడా అర్హత లేని విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఒక దిష్టిబొమ్మలా నిలుస్తున్నారు. ఆయన విషం చిమ్మేలా ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు మా వైపు ఉన్నందుకు ధన్యవాదాలు’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment