శివసేనను బానిసగా చూశారు | Sanjay Rawat Sensational Comments On BJP | Sakshi
Sakshi News home page

శివసేనను బానిసగా చూశారు

Published Mon, Jun 14 2021 12:36 AM | Last Updated on Mon, Jun 14 2021 4:40 AM

Sanjay Rawat Sensational Comments On BJP - Sakshi

 ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వ హయాంలో తమ పార్టీని బానిసగా చూశారని శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉండగా శివసేన పార్టీని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. శనివారం ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్‌లో శివసేన కార్యకర్తలతో ఎంపీ సంజయ్‌ మాట్లాడారు. శివ సైనికులకు ఏం చేయలేకపోయినా, రాష్ట్ర నాయకత్వం ఇపుడు శివసేన చేతిలో ఉందని గర్వంగా చెప్పగలమని అన్నారు. ఈ భావనతోనే మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మునుపటి ప్రభుత్వంలో శివసేనకు ద్వితీయ హోదా ఉందని, బానిసలా చూశారని రావుత్‌ అభిప్రాయపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తమ పార్టీని ముగించే ప్రయత్నాలు కూడా జరిగాయని ఆరోపించారు. తమ మద్దతు కారణంగానే అధికార హోదా అనుభవించారని ఎంపీ వ్యాఖ్యానించారు.   


ఆ అజిత్‌ నేడు కీలక ప్రతినిధి.. 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలో విడిగా కలుసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రాజకీయ ఊహాగానాలకు తెరదీయడంతో రావుత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో శివసేన బీజేపీ కూటమి ముఖ్యమంత్రి పీఠం వివాదంలో విడిపోయాయి. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహావికాస్‌ ఆఘాడీ ఏర్పాటుచేసి ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఉండాలని అనుకుంటూ ఉండేవాడినని సంజయ్‌ తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలను గుర్తుచేసుకున్న రావుత్‌.. దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆధ్వర్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి వెళ్లిన ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌పవార్‌ ఇపుడు మహావికాస్‌ ఆఘాడీలో కీలక ప్రతినిధి అని అన్నారు. ఫడ్నవిస్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే కొనసాగిందని రావుత్‌ ఎద్దేవాచేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేతో కలసి సన్నిహితంగా పనిచేస్తున్నాని అన్నారు. 


సీఎం పదవి పంచుకోబోం.. 
మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో ఐదేళ్లూ శివసేనకే ముఖ్యమంత్రి పీఠం ఉంటుందని సంజయ్‌ రావుత్‌ వ్యాఖ్యానించారు. అది చర్చించనవసరం కూడా లేదని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోల్‌ చేసిన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ వీడియో ఉందని, ఇందులో పటోల్‌ ముఖ్యమంత్రి కావాలని నెటిజన్లు ఆకాంక్షించారు. దీంతో నాసిక్‌లో విలేకరులతో మాట్లాడిన రావుత్‌.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం లేదన్నారు.  పదవిని ఆశించడటం లో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలలో అనేక మంది యోగ్యులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో దేశాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న నాయకులు  చాలామంది ఉన్నారని అన్నారు. మహా వికాస్‌ అఘాడీ సైద్ధాంతికంగా మూడు వేరువేరు పార్టీల కూటమి అన్నారు. ఒక ప్రభుత్వాన్ని నడపడానికి కలిసి వచ్చామని, ఇపుడు రాజకీయంగా ఒక్కటయ్యామని చెప్పారు. మూడు పార్టీలకు తమ పార్టీలను విస్తరించడానికి, బలోపేతం చేయడానికి హక్కు ఉందని రావుత్‌ తెలిపారు.  

మోదీపై పోరాటంలో తప్పేంటి? 
ఎన్నికల వ్యూహకర్రత ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో అయిన భేటీపై అడిగిన ప్రశ్నకు.. కిషోర్‌ ఇంతకు ముందు పలువురు రాజకీయ నాయకులను కలిశారని, నరేంద్ర మోదీ కోసం కూడా పనిచేశారని చెప్పారు. 2024లో నరేంద్రమోదీపై పోరాటం చేయడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే, అందులో తప్పేంటని ఎంపీ ప్రశ్నించారు. ఇక  2024లో మోదీ తిరిగి ఎన్నికవుతారని దేవేంద్ర ఫడ్నవిస్‌ చేసిన వ్యాఖ్యలపై రావుత్‌ స్పందిస్తూ, ‘‘అది జరగదని మేం ఎప్పుడు చెప్పాం. ఫడ్నవీస్‌ తన పార్టీ వైఖరిని తెలియజేస్తున్నారు. మోదీ బీజేపీ అగ్ర నాయకుడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మోదీకి వ్యతిరేకంగా బలీయమైన పోరాటం చేయటానికి వస్తే తప్పేంటి అన్నారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమని, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్‌షాలు ఓడిపోయారు కానీ బీజేపీ కాదని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement