ముంబయి: ఇటీవల శరద్ పవార్, అజిత్ పవార్‌ల భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జట్టు కడుతున్న ఇండియా కూటమిని చెదరగొట్టేందుకు అజిత్ పవార్ నేతృత్వంలో వ్యూహం నడుస్తోందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తు కుదిరితే శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని వినికిడి. దీనిపై ఆయన ఏం చెప్పారంటే..?
పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శరద్ పవార్, అజిత్ పవార్‌లు భేటీ అయ్యారు. అజిత్ పవార్ వర్గం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిన నెలరోజుల తర్వాత చిన్నాన్న శరద్ పవార్‌ను కలిశారు. అయితే.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష కూటమికి షాక్ ఇచ్చే విధంగా శరద్ పవార్‌ను బీజేపీతో కలిసేలా అజిత్ పవార్ ఒప్పించే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకున్నారు.
ఈ పుకార్లపై మాట్లాడిన శరద్ పవార్.. అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొంతమంది శ్రేయోభిలాషులు తనను బీజేపీతో పొత్తు కుదిరేలా ఒప్పించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని కూడా పేర్కొన్నారు. అజిత్ పవార్‌తో సమావేశం జరిగినట్లు పేర్కొన్న ఆయన.. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.
కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పార్టీ పెద్దగా తనకు ఏం ఆఫర్ ఇవ్వగలరని అన్నారు. అజిత్ పవార్‌తో సాధారణంగానే సమావేశం జరిగిందని శరద్ పవార్ గతంలో కూడా చెప్పారు.
అయితే.. శరద్ పవార్ భేటీ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) కూటమిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శరద్ పవార్‌ను భీష్మ పితామహగా పేర్కొన్న ఎంపీ సంజయ్ రౌత్.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఎలాంటి పనులను శరద్ పవార్ చేయరని ధీమా వ్యక్తం చేశారు.
ముంబయిలో ఆగష్టు 31న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిణామాలు మహాకూటమిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విభజించడమే బీజేపీకి తెలిసిన పని అని శరద్ పవార్ విమర్శించారు. యథావిధిగా కూటమి భేటీ జరుగుతుందని అన్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం
Comments
Please login to add a commentAdd a comment