బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్‌లో కార్పొరేటర్ ఎన్నిక చెల్లదంటూ టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఎన్నికల ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసినప్పటి నుంచి డివిజన్ బీజేపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఓ వైపు కార్పొరేటర్ ప్రమాణస్వీకారం ఏర్పాట్లలో ఉండగా మరోవైపు పార్టీలో కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిపై పోస్టులు పెట్టడం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతల రాంచంద్రారెడ్డి టికెట్ కోసం రూ.కోటిన్నర తీసుకున్నారనే అర్థం వచ్చేలా శంకర్‌ప్రసాద్ అనే బీజేపీ కార్యకర్త తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది.
ఈ మేరకు ఇరువర్గాల మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. కాగా తాజాగా ఆదివారం మరికొన్ని వాట్సప్ గ్రూపుల్లో ఓ బీజేపీ కార్యకర్త రాసిన లేఖ మరింత రచ్చ చేసింది. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఇద్దరు పిల్లల నిబంధన ఉల్లంఘించిన విషయం ముందే తెలిసినా చింతల రాంచంద్రారెడ్డి పట్టించుకోకుండా పార్టీ పరువును రచ్చకీడ్చారంటూ లేఖలో ఆరోపణలు చేయడం పార్టీ పెద్దలను కలవరపెట్టింది.
గ్రేటర్ ఎన్నికల తర్వాత తలెత్తిన అనర్హత వివాదం మూడు నెలల్లోనే తేల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆందోళనలో ఉన్న పార్టీ పెద్దలకు సొంత పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకుంటున్న వాట్సాప్ వార్ ఎక్కడికి దారితీస్తుందోనని టెన్షన్ పట్టుకుంది. టికెట్ కోసం చివరి క్షణం దాకా ప్రయతి్నంచిన కొంతమంది నేతల అనుచరులు జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు టికెట్లు ఇచ్చి ఉంటే పార్టీ పరువు పోయేది కాదు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment