సాక్షి, అమరావతి: ‘హోదా’పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన పంపాలని.. అలా తమ పార్టీ కూడా కోరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇందుకోసం విడిగా ఒక సమావేశం అడగమనండి.. పెట్టమనండి అని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం అయినందున ఈనెల 17న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆ అంశాన్ని అజెండా నుంచి కేంద్రం తొలగించిందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు తెలంగాణకు ఎలాంటి సంబంధంలేదని.. ఇది దానిలో పెట్టాల్సిన అంశం కాదని ఆయన చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హోదాకు సరిపడా నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధం
ఇక ప్రత్యేక హోదాకు సరిపడా నిధులు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వంలో కొంత కసరత్తు జరిగిందని సోము వీర్రాజు వెల్లడించారు. అప్పట్లో ఆ మేర నిధులివ్వడానికి కేంద్రం సిద్ధపడిందని, హోదా అంశంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమేరకు ముందుకెళ్లిందని చెప్పడానికే ఈ అంశాలను తాను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానన్నారు. ప్రత్యేక హోదాకు సరిపడా నిధులివ్వడానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కసరత్తును ఈ ప్రభుత్వం మళ్లీ మొదలెట్టాలని వీర్రాజు అన్నారు.
17న కేంద్రమంత్రి గడ్కరీ రాక
రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, మరికొన్నింటి శంకుస్థాపనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా 21 జాతీయ రహదారులను ప్రారంభిస్తారని, మరో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. రూ.64 వేల కోట్ల ఖర్చుతో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని.. ఇందులో అధిక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకోవాలని ఆయన సూచించారు. రిజర్వేషన్ల వ్యవహారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని వీర్రాజు ప్రశ్నించారు. ఈనెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గడ్కరీ పాల్గొనే సభా వేదిక నిర్మాణాన్ని సోము వీర్రాజు పరిశీలించారు.
‘హోదా’పై ప్రత్యేక భేటీ!
Published Mon, Feb 14 2022 4:02 AM | Last Updated on Mon, Feb 14 2022 4:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment