సాక్షి, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో వరుస ఓటములు మూటగట్టుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్ల ఒత్తిడి మేరకు పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరింది. నాయకత్వలో మార్పులు తీసుకురావల్సిన సమయం ఆసన్నమైందన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే గత వారం రోజులుగా జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణామాల అనంతరం.. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. (కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్లు లేఖ)
అయితే దీనిపై ఇప్పటి వరకు పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు పార్టీలో నాయకత్వ మార్పులు తీసుకురావాలని 23 మంది సీనియర్లు ఆదివారం కాంగ్రెస్ అధినేత్రికి లేఖరాశారు. అంతేకాకుండా పార్టీలోని జూనియర్లు సైతం నాయకత్వ మార్పును కోరుకూండా స్వరాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేతను ఎన్నుకుంటారా అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment