సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతోంది. పొత్తులకు సంబంధించి రకరకాల ప్రచారం సాగుతున్నప్పటికీ, జాతీయ పార్టీ సూచనల మేరకు రాష్ట్ర పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గురువారం ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది.
కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ గురువారమే నియోజకవర్గ కార్యాలయాలను ప్రారంభిస్తోంది. గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులను భాగస్వాములను చేస్తోంది. నెల క్రితమే.. బీజేపీకీ ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం – కేంద్రంలో మరో విడత’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా వాల్ పెయింటింగ్‌లు, పోస్టర్లు వేయించారు.
అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
20 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ముగ్గురేసి ఒక కమిటీగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉండే అభ్యర్ధుల బయోడేటాలు సేకరించారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 2,438 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జాతీయ పార్టీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్‌తో జరిగిన రాష్ట్ర ముఖ్యనేతల భేటీలో లోక్‌సభ స్థానాల్లో పోటీకి అవకాశం ఉన్న నాయకులు, పార్టీ బలాబలాలపై చర్చించారు.
రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులతో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న పరిపూర్ణానంద స్వామి కూడా లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల వారీగా ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలు
కేవలం నామమాత్రంగా కాకుండా, పూర్తిస్థాయిలో పార్టీ పోటీలో ఉండేలా పార్టీ పలు చర్యలు చేపట్టింది. అభ్యర్ధులకు అన్ని విధాలా తోడ్పాటునందించేందుకు ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు 37 మందితో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో అంశాలను 37 విభాగాలుగా వర్గీకరించారు.
ఒక్కొక్క విభాగం బాధ్యతలు ఈ కమిటీలోని ఒకరికి అప్పగించారు. పార్టీ ఎన్నికల కార్యక్రమాలను జాతీయ, రాష్ట్ర పార్టీ సులభంగా పర్యవేక్షించేలా ఐదేసి లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా విభజించి, 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు.
అగ్రనేతలు రంగప్రవేశం..
ఎన్నికలకు సంబంధించి బీజేపీ రానున్న నెల రోజుల కార్యక్రమాలను సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జెపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్లస్టర్ల వారీగా ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇతరత్రా కార్యక్రమాలు ఉండవు. ఒక వేళ రెండో పూట పర్యటన ఉంటే ఆ ప్రాంతంలోని వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపారు.
ఫిబ్రవరి 9, 10 తేదీల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు పర్యటించి, బూత్‌లవారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అక్కడ పార్టీ ఏజెంట్లుగా పనిచేసే వారిని గుర్తించి రాష్ట్ర పారీ్టకి నివేదిస్తారు. ఎన్నికల ప్రక్రియ జరిగే నెలన్నరలో రాష్ట్రమంతటా 20 వేల బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment